మెకాంజీ రెండో వివాహం.. జెఫ్‌ బెజోస్ స్పందన | Billionaire MacKenzie Scott Jeff Bezos Ex Wife Marries Teacher | Sakshi
Sakshi News home page

టీచర్‌ను పెళ్లాడిన మెకాంజీ.. జెఫ్‌ బెజోస్‌ హర్షం

Published Mon, Mar 8 2021 9:28 AM | Last Updated on Mon, Mar 8 2021 3:16 PM

Billionaire MacKenzie Scott Jeff Bezos Ex Wife Marries Teacher - Sakshi

భర్త డాన్‌ జెవెట్‌తో మెకాంజీ(ఫొటో కర్టెసీ: గివింగ్‌ప్లెడ్జ్‌ ఆర్గనైజేషన్‌)

మెకాంజీ స్కాట్‌, ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య అన్న సంగతి తెలిసిందే.

వాషింగ్టన్‌: ప్రపంచ మహిళా ధనవంతుల్లో ఒకరైన నవలా రచయిత్రి, అమెజాన్‌ షేర్‌ హోల్డర్‌ మెకాంజీ స్కాట్ రెండో వివాహం చేసుకున్నారు. సీటెల్‌కు చెందిన టీచర్‌ డాన్‌ జెవెట్‌ను ఆమె పెళ్లాడారు. ఈ విషయాన్ని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. అదే విధంగా జెవెట్‌ సైతం మెకాంజీకి సంబంధించిన వెబ్‌సైట్(ప్లెడ్జ్‌ పేజీ)‌ ద్వారా ధ్రువీకరించారు. ఈ మేరకు.. ‘‘అత్యంత దయనీయురాలు, కరుణామూర్తి అయిన మహిళను నేను పెళ్లి చేసుకున్నాను. అంతేకాదు, సంపద దానం చేసే విషయంలో తను ఎంతో నిబద్ధతగా నెరవేరుస్తున్న బాధ్యతల్లో భాగం కాబోతున్నాను’’ అంటూ తాను ఆనందడోలికల్లో తేలుతున్నట్లు పేర్కొన్నారు.

కాగా జెవెట్‌ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇక మెకాంజీ స్కాట్‌, ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెకాంజీ రెండో వివాహంపై స్పందించిన ఆయన.. ‘‘డాన్‌ చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. వాళ్లిద్దరు తీసుకున్న నిర్ణయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇక 25 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ బెజోస్‌- మెకాంజీ 2019లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామన్న బెజోస్‌.. ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్‌ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్‌ అమెజాన్‌ షేర్లను జెఫ్‌ బెజోస్,‌ మెకాంజీ పేరిట బదలాయించినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రపంచంలోని సంపన్న మహిళల్లో ఒకరిగా ఆమె నిలిచారు. కాగా 50 ఏళ్ల మెకాంజీ, సామాజిక సేవలో భాగంగా గతేడాది 6 బిలియన్‌ డాలర్ల సంపదను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భర్త డాన్‌ జెవెట్‌ కూడా ఇకపై ఆమెకు తోడుగా నిలవనున్నారు. కాగా బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం మెకాంజీ ప్రస్తుత సందప 53.5 బిలియన్‌ డాలర్లు.

చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ సోదరుడికి షాకిచ్చిన బెజోస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement