
న్యూఢిల్లీ: 4జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. పూర్తి దేశీ సాంకేతికతను ఉపయోగించాలని నిర్దేశించుకున్నందున ఇందుకు కాస్త సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ సంతృప్తికర స్థాయిలోనే జరుగుతోందని మంత్రి చెప్పారు.
ప్రస్తుతం 800 పైగా జిల్లాల్లో 5జీ సర్వీసులు ఉన్నాయని, ఇతరత్రా ఏ దేశంలోనూ ఇంత వేగంగా సేవల విస్తరణ జరగలేదని ఆయన పేర్కొన్నారు. లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి ఇండియా పోస్ట్, సీఏఐటీ, తృప్తా టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌహాన్ ఈ విషయాలు చెప్పారు.
ఇండియా పోస్ట్‌కి ఉన్న విస్తృత నెట్‌వర్క్ సాయంతో చిన్న వ్యాపారాలకు డెలివరీ సేవలను అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని వివరించారు. లాజిస్టిక్స్ సర్వీసుల ను అందించేందుకు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)తో కూడా చేతులు కలపాలని ఇండియా పోస్ట్ యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.