ముంబై: దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ తాజాగా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 1 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 7300 కోట్లు) చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి దేశీయంగా అతిపెద్ద ఎడ్యుటెక్ డీల్స్‌లో ఒకటిగా ఇది నిలవనున్నట్లు అభిప్రాయపడ్డాయి. కోవిడ్–19 నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులకు డిమాండ్ మరింత పెరగడంతో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బైజూస్ ఇటీవల నిధుల సమీకరణ చేపట్టిన విషయం విదితమే.
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంస్థతోపాటు, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, బాండ్ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంది. దీంతో బైజూస్ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఇంజినీరింగ్, మెడికల్ విద్యా శిక్షణలో పట్టున్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌కు దేశవ్యాప్తంగా 200 శిక్షణా కేంద్రాలున్నాయి. బైజూస్‌తో డీల్‌లో భాగంగా ఆకాష్‌లో కంపెనీ వ్యవస్థాపకులు చౌధరీ కుటుంబ సభ్యులు వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఆకాష్‌లోగల 37.5 శాతం వాటాకుగాను బైజూస్‌లో కొంత వాటాను బ్లాక్‌స్టోన్ గ్రూప్ పొందే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
జేఈఈ ప్రిపరేషన్‌కు ‘అమెజాన్ అకాడమీ’
అమెజాన్ ఇండియా ‘అమెజాన్ అకాడమీ’ పేరిట జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ప్రిపరేషన్ కోసం విద్యార్థులకు అవసరమైన ఆన్‌లైన్ వేదికను ప్రారంభించింది. గూగుల్‌ప్లే స్టోర్‌లో బీటా వర్షన్ యాప్ ఉచితంగా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బైజూస్, అన్‌అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ఇండియా (ఎడ్యుకేషన్) డైరెక్టర్ అమోల్ గుర్వారా తెలిపారు. జేఈఈతో పాటు బీఐటీఎస్‌ఏటీ, వీఐటీఈఈఈ, ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ, ఎంఈటీ పరీక్షల విద్యార్థులకు కూడా నాణ్యమైన కంటెంట్ అందుబాటులో ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment