న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) లక్ష్యం మేరకు నమోదవుతున్నట్లు కనబడుతోంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం వెలువరించిన గణాంకాల ప్రకారం నవంబర్ నాటికి ద్రవ్యలోటు రూ.6,95,614 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (2021–22 స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ అంచనాల్లో 6.8 శాతం) లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. అంటే లక్ష్యంలో నవంబర్ నాటికి ద్రవ్యలోటు 46.2 శాతంగా ఉందన్నమాట. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే సమయానికి ద్రవ్యలోటు లక్ష్యానికి మించి ఏకంగా 135.1 శాతానికి ఎగసింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ విలువలో 9.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గణాంకాలు మెరుగ్గా ఉండడానికి ఆదాయ వసూళ్లలో పెరుగుదల, వివిధ మంత్రిత్వశాఖల తక్కువ వ్యయాలు కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
- నవంబర్ ముగింపునకు ప్రభుత్వ ఆదాయాలు రూ.13.78 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో (బీఈ) ఈ మొత్తం 69.8 శాతానికి చేరింది. 2020–21 ఇదే సమయానికి బడ్జెట్ అంచనాల్లో ఈ పరిమాణం కేవలం 37 శాతంగా ఉంది.
- ఒక్క పన్ను (నికర) ఆదాయాలు చూస్తే, బడ్జెట్ అంచనాల్లో 73. 5 శాతానికి చేరింది. గత ఏడాది ఇదే కాలానికి ఈ పరిమాణం కేవలం 42.1 శాతంగా ఉంది.
- ఇక ప్రభుత్వ వ్యయాలు రూ.20.74 లక్షల కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనాల్లో ఇది 59.6 శాతానికి చేరింది.
2025–26 నాటికి 4.5 శాతానికి..!
ద్రవ్యలోటు 2021–22 లక్ష్యం కన్నా తక్కువగా 6.6 శాతంగానే నమోదవుతుందన్న అభిప్రాయాన్ని ఇటీవలే ఇండియా రేటింగ్స్ నివేదిక వ్యక్తం చేసింది. ఆర్‌బీఐసహా పలు విశ్లేషణా సంస్థలు 6.8 శాతం వద్ద ద్రవ్యలోటు కట్టడి కష్టమని విశ్లేషిస్తున్న నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ అభిప్రాయానికి ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment