న్యూఢిల్లీ: విదేశీ సంస్థల ఆధీనంలోని మొబైల్ కమ్యూనికేషన్, హ్యాండ్‌సెట్ తయారీ సంస్థల కార్యాలయాలు, వాటికి సంబంధించిన వ్యక్తుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా పన్ను ఎగవేత జరిగిందని ఆదాయ పన్ను విభాగం గుర్తించింది. రూ. 6,500 కోట్ల పైచిలుకు లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
డిసెంబర్ 21న తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ మొదలైన రాష్ట్రాల్లో ఆయా సంస్థల కార్యాలయాల్లో ఐటీ విభాగం సోదాలు నిర్వహించింది. రెండు పెద్ద కంపెనీలు.. విదేశాల్లోని తమ మాతృ సంస్థలకు ఏకంగా రూ. 5,500 కోట్ల పైచిలుకు మొత్తాన్ని రాయల్టీ మొదలైన రూపాల్లో చెల్లించాయని ఈ సోదాల్లో తేలినట్లు సీబీడీటీ పేర్కొంది. అయితే ఆ సంస్థల పేర్లు మాత్రం వెల్లడించలేదు. సందేహాస్పద సంస్థల నుంచి రూ. 5,000 కోట్ల పైచిలుకు రుణాలు చూపిన దేశీ విభాగాలు.. వాటిపై వడ్డీ వ్యయాలను కూడా క్లెయిమ్ చేసుకున్నాయని సీబీడీటీ పేర్కొంది. అలాగే అనుబంధ సంస్థల తరఫున చేసిన చెల్లింపులను ఎక్కువగా చేసి చూపించడం, భారత విభాగాల లాభాలను (పన్నులు వర్తించే) తక్కువ చేసి చూపించడం వంటి అవకతవకలకు పాల్పడ్డాయని తెలిపింది. ఈ తరహా నేరాలకు రూ. 1,000 కోట్ల పైగా జరిమానా విధించేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది.
చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్..
Comments
Please login to add a commentAdd a comment