న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ వ్యవస్థకు సంబంధించి వివిధ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న అభియోగాలపై టెక్ దిగ్గజం గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ. 1,338 కోట్ల జరిమానా విధించింది. అంతే కాకుండా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడాన్ని మానుకోవాలని ఆదేశించింది. నిర్దిష్ట వ్యవధిలోగా తన తీరును మార్చుకోవాలని సూచించింది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మూడేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం సీసీఐ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే మొబైల్ తయారీ సంస్థలు (ఓఈఎం) .. గూగుల్ మొబైల్ సూట్‌ను (జీఎంఎస్) కూడా పొందుపర్చేలా తప్పనిసరిగా నిర్దిష్ట ఒప్పందం కుదుర్చుకోవాలని గూగుల్ షరతు విధిస్తోందన్న ఆరోపణ కూడా ఈ ఫిర్యాదుల్లో ఉంది.
దీనితో పాటు మరికొన్ని అభియోగాలపై లోతుగా విచారణ జరపాలంటూ 2019 ఏప్రిల్‌లో సీసీఐ ఆదేశించింది. అక్టోబర్ 25న పదవీ విరమణ చేస్తున్న సీసీఐ చైర్‌పర్సన్ అశోక్ కుమార్ గుప్తా తాజాగా తుది ఉత్తర్వులు ఇచ్చారు. అన్‌ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్ లేకుండా జీఎంఎస్‌ను తప్పనిసరిగా ప్రీ–ఇన్‌స్టాల్ చేయాలనడం డివైజ్‌ల తయారీదారులకు అసమంజస షరతు విధించడమే అవుతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే, స్మార్ట్ డివైజ్‌లలో ప్రీ–ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను ఎక్కడ ఉంచాలనే విషయంలోనూ ఓఈఎంలపై ఒత్తిడి తేకూడదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment