న్యూఢిల్లీ: తనఖా లేని రుణాలు పొందడంలో అంకుర సంస్థలకు తోడ్పాటు అందించేలా కేంద్ర ప్రభుత్వం రుణ హామీ పథకాన్ని (సీజీఎస్‌ఎస్) ప్రకటించింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ప్రకారం అర్హత కలిగిన స్టార్టప్‌లు అక్టోబర్ 6న లేదా ఆ తర్వాత మెంబర్ సంస్థల (ఎంఐ) నుంచి తీసుకున్న రుణాలకు ఈ స్కీము వర్తిస్తుంది. ఒక్కో రుణగ్రహీతకు గరిష్టంగా రూ. 10 కోట్ల వరకూ గ్యారంటీ లభిస్తుంది. స్టార్టప్‌ల నిధుల అవసరాలకు ఈ పథకం సహాయపడగలదని డీపీఐఐటీ తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌లను (ఏఐఎఫ్) ఎంఐలుగా వ్యవహరిస్తారు. గుర్తింపు పొంది .. స్థిరంగా ఆదాయాన్ని పొందే స్థాయికి చేరుకున్న స్టార్టప్‌లకు ఈ స్కీము వర్తిస్తుంది.
సదరు స్టార్టప్‌లు ఏ ఆర్థిక సంస్థకు డిఫాల్ట్ కాకూడదు. అలాగే మొండిపద్దుగా ఉండకూడదు. ఈ స్కీము అమలు కోసం కేంద్రం ప్రత్యేక ట్రస్టు లేదా ఫండ్ ఏర్పాటు చేస్తుంది. బోర్డ్ ఆఫ్ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ఈ ఫండ్‌కి ట్రస్టీగా వ్యవహరిస్తుంది. ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు డీపీఐఐటీ ప్రత్యేకంగా మేనేజ్‌మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment