న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు సాగించే కంపెనీలు ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. పౌరుల డేటాను కాపాడాల్సిన బాధ్యత వాటికి ఉంటుందని స్పష్టం చేశారు. స్టార్టప్20 శిఖర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డేటా లోకలైజేషన్ వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారీ సంఖ్యలో యూజర్లున్న భారత మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని శర్మ చెప్పారు. భారతీయ పౌరుల డేటాను పొందే టెక్ కంపెనీలు.. ఇక్కడి నియమ నిబంధనలను పాటించబోమనేందుకు ఆస్కారం ఉండబోదని ఆయన తెలిపారు. భారత యూజర్ల డేటాను దేశీయంగానే భద్రపర్చాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర దిగ్గజాలు వాదిస్తుండగా.. విదేశీ కంపెనీలు మాత్రం ఇతర దేశాల్లో భద్రపర్చే స్వేచ్ఛ కావాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన లోపాలపై స్పందిస్తూ.. ఇది స్టార్టప్‌లకు మాత్రమే పరిమితం కాదని ప్రతి రంగంలోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు. స్టార్టప్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడంపై మాట్లాడుతూ.. వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న ఆవిష్కరణలు చేసే సంస్థలకు నిధుల కొరత లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment