ముంబై: ప్రస్తుత ఏడాది పండుగల సందర్భంగా డిమాండ్ సగానికి క్షీణించి 15 శాతంగా ఉన్నట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. 2023లో పండుగల సీజన్‌లో డిమాండ్ 32 శాతం పెరగ్గా, 2022లో 88 శాతం వృద్ధి చెందినట్టు గుర్తు చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ అమ్మకాలు పండుగల సీజన్‌లో పెరిగినప్పటికీ, మొత్తం మీద వృద్ధి నిదానంగానే ఉన్నట్టు పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాలు, టైర్–2, 3 పట్టణాల్లో డిమాండ్ స్థిరంగానే ఉండగా.. మెట్రోల్లో, పారిశ్రామిక డిమాండ్ బలహీనంగా ఉన్నట్టు వివరించింది. పట్టణ డిమాండ్ బలహీనంగా ఉన్నట్టు గత నెలలో కేంద్ర ఆర్థిక శాఖ సైతం ప్రకటించడం గమనార్హం. డిసెంబర్ నెలలో వివాహాలు అధిక సంఖ్యలో ఉండడం డిమాండ్‌కు ఊతం ఇవ్వొచ్చని నోమురా అంచనా వేస్తోంది. రిటైల్ అమ్మకాల వృద్ధి 2023లో ఉన్న 36.4 శాతం నుంచి.. 2024లో 13.3 శాతానికి పరిమితం కావొచ్చన్న అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనాలను తన నివేదికలో నోమురా ప్రస్తావించింది.
మరోవైపు రిటైల్ ఆటో విక్రయాలు 14 శాతం పెరగ్గా.. హోల్‌సైల్ వైపు ప్యాసింజర్ అమ్మకాలు, మధ్యశ్రేణి వాణిజ్య వాహనాల అమ్మకాలు బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక మందగమనం కొనసాగుతోందంటూ.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.2 శాతం ఉండొచ్చన ఆర్‌బీఐ అంచనాలు మరీ ఆశావాహంగా ఉన్నట్టు నోమురా అభివర్ణించింది.
Comments
Please login to add a commentAdd a comment