చైనా యాప్స్‌కు చెక్ | China Apps Are Gradually Falling In India | Sakshi
Sakshi News home page

చైనా యాప్స్‌కు చెక్

Published Wed, Feb 10 2021 3:24 AM | Last Updated on Wed, Feb 10 2021 10:08 AM

China Apps Are Gradually Falling In India - Sakshi

బెంగళూరు: భారత్‌లో దేశీ యాప్స్‌కు ఆదరణ పెరుగుతుండగా.. చైనా యాప్స్‌ క్రమంగా వెనుకబడుతున్నాయి. మార్కెటింగ్‌ అనలిటిక్స్‌ సంస్థ యాప్స్‌ఫ్లయర్‌ నివేదిక ప్రకారం గతేడాది భారత మార్కెట్లో చైనా యాప్స్‌ వాటా 29%కి పరిమితం కాగా.. దేశీ యాప్స్‌ ఇన్‌స్టాల్స్‌ పరిమాణం 40%గా ఉంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లోకి ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, జర్మనీ యాప్స్‌ కూడా ప్రవేశించి.. చైనా యాప్స్‌కు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. నివేదిక ప్రకారం గతేడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 30 మధ్య లో 4,519 యాప్స్‌కు సంబంధించి 730 కోట్ల ఇన్‌స్టాల్స్‌ నమోదయ్యాయి. వీటిలో వినోదం, ఫైనాన్స్, షాపింగ్, గేమింగ్, ట్రావెల్, న్యూస్‌ తదితర విభాగాల యాప్స్‌ ఉన్నాయి. చౌక హ్యాండ్‌సెట్స్, డేటా చార్జీల ఊతంతో ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాల్లో గేమింగ్, ఫైనాన్స్, వినోద విభాగాల్లో మొబైల్‌ వాడకం పెరిగింది. ప్రాంతీయ భాషల్లోనే కంటెంట్‌ లభ్యత ఈ ధోరణికి కారణమని యాప్స్‌ఫ్లయర్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ సంజయ్‌ త్రిశల్‌ తెలిపారు.

ఫిన్‌టెక్‌ యాప్స్‌కు కష్టాలు.. 
చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు.. భారత మార్కెట్లో భారీగా అమ్మకాలు సాధిస్తున్నప్పటికీ.. ఫిన్‌టెక్‌ రంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.  షావోమి, ఒప్పో, రియల్‌మి వంటి పలు చైనా స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు 2020 తొలినాళ్లలో తమ ఫిన్‌టెక్‌ యాప్స్‌ను ప్రవేశపెట్టాయి. మి పే, మి క్రెడిట్, ఒప్పో క్యాష్, రియల్‌మి పేసా పేర్లతో అందుబాటులోకి తెచ్చాయి. ఈ కంపెనీల స్మార్ట్‌ఫోన్లకు యూజర్ల సంఖ్య కోట్లలో ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా గూగుల్‌ ప్లే స్టోర్‌లో వీటిలో ఒక్కో యాప్‌ డౌన్‌లోడ్స్‌ పది లక్షల కన్నా తక్కువే ఉండటం గమనార్హం. ఇక లావాదేవీలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకారం.. గతేడాది మొత్తం మీద చూస్తే నెలవారీ లావాదేవీలు మి పే ద్వారా 4,80,000, రియల్‌మి పేసాద్వారా 10,000 మాత్రమే జరిగాయి. అదే ఫోన్‌పే ద్వారా 90.23 కోట్లు, గూగుల్‌ పేలో 85.44 కోట్ల మేర నెలవారీ లావాదేవీలు నమోదయ్యాయి. ఇక తక్షణ రుణాలు, బీమా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల సరీ్వసులు మొదలైన వాటికీ ఆదరణ లభించడం లేదు.   

చైనాపై వ్యతిరేకతే కారణం.. 
తమకు ప్రస్తుతం ఉన్న యూజర్ల ఊతంతో ఆర్థిక సర్వీసులు మొదలైన విభాగాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరించవచ్చని చైనా కంపెనీలు భావించాయి. దానికి అనుగుణంగానే ఫిన్‌టెక్‌ సేవలను ప్రవేశపెట్టాయి. కానీ, భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా కంపెనీలపై కూడా ఆ ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని పరిశీలకులు తెలిపారు. దీంతో భారతీయుల్లో ప్రస్తుతం ఉన్న సెంటిమెంటు దృష్ట్యా చైనా కంపెనీలు పెద్దగా ప్రచార ఆర్భాటాల జోలికి పోవడం లేదని పేర్కొన్నారు. ఏడాది, రెండేళ్ల వ్యవధిలో బ్రాండ్లు మార్చేసే యూజర్లు.. ఆర్థిక సేవల విషయంలో ఎక్కువగా పేటీఎం లేదా గూగుల్‌ పే వంటి వాటినే ఎంచుకుంటారు తప్ప చైనా ఫిన్‌టెక్‌ యాప్‌లపై ఆధారపడటం లేదని వివరించారు. 

తగ్గుతున్న థర్డ్‌ పార్టీ యాప్స్‌ రుణాలు.. 
కరోనా వైరస్‌ మహమ్మారి దరిమిలా చాలా మంది క్రెడిట్‌ స్కోర్లు గతేడాది భారీగా పడిపోయాయి. దీంతో థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా రుణాల లావాదేవీలు కూడా గణనీయంగా తగ్గాయి. స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు తమ ఫిన్‌టెక్‌ కార్యకలాపాలను పెద్దగా విస్తరించలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని రీసెర్చ్‌ సంస్థ టెక్‌ఆర్క్‌ వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీలు తొందరపడకుండా, నెమ్మదిగా ప్రణాళికల అమలుపై పనిచేస్తున్నాయని ఒప్పో కాష్, రియల్‌మి పేసాకి సర్వీసులు అందించే ఫిన్‌షెల్‌ వర్గాలు వివరించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement