డీకార్బనైజ్డ్ మెకానిజంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన సదస్సులో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల కర్నూలులో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ పంప్డ్ స్టోరేజ్ రెన్యువబుల్ ప్రాజెక్ట్ గురించిన వివరాలను సీఎం జగన్ తెలియజేశారు. ఏపీలో ఏర్పాటు చేసిన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు ద్వారా విండ్, హైడల్, సోలార్ విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో ఎటువంటి కాలుష్యం లేకుండా సుస్థిరమైన విద్యుత్‌ను సాధించవచ్చన్నారు. అంతేకాకుండా హైడ్రోజన్, అమ్మోనియంలను కూడా పొందవచ్చని సీఎం వెల్లడించారు.
షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్టు
ప్రపంచంలోనే అతి పెద్దదైన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు పనులు ఇటీవలే కర్నూలులో మొదలయ్యాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ కొత్త ట్రెండ్‌ను నెలకొల్పిందన్నారు. అంతేకాదు గ్రీన్ ఎనర్జీ ప్రొడక‌్షన్‌కు సంబంధించి షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్టు నిలుస్తుందన్నారు. కేవలం పంప్డ్ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం సాధారణ విషయం కాదన్నారు.
ఏపీ ఆహ్వానిస్తోంది
కర్నూలులో నిర్మిస్తోన్న విండ్, హైడల్, సోలార్ పవర్ ప్రాజెక్టులో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఏపీలో ఉందన్నారు. ఈ మహాత్తర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఏపీ తరఫున పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. పర్యావరణం పట్ల ప్రేమ ఉన్నవారు, బిగ్ థింకింగ్ ఉన్న వారికి ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్ మరోసారి తెలిపారు.
ఏపీ ఆదర్శం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి అయోగ్ చైర్మన్ అమితాబ్‌కాంత్ మాట్లాడుతూ... కర్బణ రహిత పవర్ ఉత్పత్తికి ఇండియాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాటిని ఏపీ ఒడిసిపట్టుకుందని ఆయన అన్నారు. కర్నూలు ప్రాజెక్టులో పంప్డ్ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ రోజు ఏపీ అమలు చేస్తున్న టెక్నాలజీ రేపు ప్రపంచం అంతా అనుసరించక తప్పదన్నారు. ఏపీ అమలు చేస్తోన్న కర్బన రహిత పారిశ్రామిక విధానంపై ప్రశంసలు కురిపించారు. గ్రీన్ ఎనర్జీ కోసం ఏపీ సీఎం అమలు చేస్తున్న పాలసీ బాగుందని ఆయన అన్నారు. ఏపీ అనుసరిస్తున్న విధానాన్నే ఇతర దేశాలు కూడా కొనసాగించాలని సూచించారు.
ఏపీలో పెట్టుబడులు
27 దేశాలను పరిశీలించిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు ఆర్సెల్లార్ తరఫున ఆదిత్య మిట్టల్ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పెట్టుబడులు రెట్టింపు చేస్తామన్నారు. స్టీల్ ఉత్పత్తి సెక్టార్ నుంచి 8 శాతం కార్బన్ విడుదల అవుతోంది. కానీ ఏపీలో ఉత్పత్తి చేయబోతున్న హైడ్రోజన్‌ను స్టీలు పరిశ్రమలో ఉపయోగించడం ద్వారా స్టీల్ సెక్టార్‌లో కర్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తామన్నారు. త్వరలో ఏపీలో తొలి పునరుత్పాదక పవర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు.
విదేశాలకు ఎగుమతి
కర్నూలు ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌తో పాటు భారీ ఎత్తున అమ్మోనియం ఉత్పత్తి అవుతుందన్నారు గ్రీన్‌కో సీఈవో అనిల్ చలమల శెట్టి. దేశీ అవసరాలకు పోను మిగిలిన అమ్మోనియాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. కర్బన రహిత పవర్ ఉత్పత్తి సమర్థంగా చేయాలంటే డిజిటలేజేషన్ తప్పనిసరి. అందుకోసం ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు దస్సాల్ట్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, ఆదిత్యమిట్టల్, గ్రీన్‌కో సీఈవో అనిల్ చలమల శెట్టి, డస్సెల్ట్ సిస్టమ్స్ ఈవీవీ ఫ్లోరెన్స్‌లు పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: Integrated Renewable Energy Project: ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు.. శంకుస్థాపనకు సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment