పర్యావరణ హితం ప్రధానం! నాలుగేళ్లలో సగానికిపైగా.. | Sakshi
Sakshi News home page

CNG Passenger Vehicles: పర్యావరణ హితం ప్రధానం! నాలుగేళ్లలో సగానికిపైగా..

Published Tue, Feb 6 2024 7:59 AM

CNG Passenger Vehicles Growth High in India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) ఆధారిత ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 46 శాతం వృద్ధితో 48,714 యూనిట్లు రోడ్డెక్కాయి. 2023 జనవరిలో ఈ సంఖ్య 33,334 యూనిట్లు నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జనవరి మధ్య దేశవ్యాప్తంగా రిటైల్‌లో సీఎన్‌జీ ప్యాసింజర్‌ వాహనాలు 3,64,528 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 4,75,000 యూని ట్లు దాటవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. 2022– 23లో 39 శాతం వృద్ధితో 3,27,820 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి.

తొలి స్థానంలో మారుతి..
దేశంలో సీఎన్‌జీ ఆధారిత ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకి 69 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ ఏకంగా 13 మోడళ్లలో సీఎన్‌జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  మొత్తం 2,51,620 యూనిట్లను విక్రయించింది. 14 శాతం వాటా కలిగిన టాటా మోటార్స్‌కు నాలుగు సీఎన్‌జీ మోడళ్లు ఉన్నాయి. 2023–24 ఏప్రిల్‌–జనవరిలో 64,972 యూనిట్లు కస్టమర్లకు చేరాయి. మూడు సీఎన్‌జీ మోడళ్లతో హ్యుండై మోటార్‌ ఇండియా 41,806 యూనిట్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ప్రస్తుతం మూడు మోడళ్లలో సీఎన్‌జీని ఆఫర్‌ చేస్తోంది. జనవరితో ముగిసిన 10 నెలల కాలంలో ఈ కంపెనీ 6,064 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

నాలుగేళ్లలో సగానికిపైగా..
2014–15లో సీఎన్‌జీ ప్యాసింజర్‌ వాహనాలు దేశవ్యాప్తంగా 1,48,683 యూనిట్లు పరుగుతీశాయి. 2019– 20లో కరోనా కారణంగా పరిశ్రమ 7 శాతం క్షీణించింది. 2021–22 నుంచి వీటి అమ్మకాల్లో 30 శాతంపైగా వృద్ధి నమోదవుతూ వస్తోంది. ఇప్పటి వరకు 21,16,629 యూనిట్ల సీఎన్‌జీ ఆధారిత కార్లు, ఎస్‌యూవీలు కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. ఇందులో గడిచిన నాలుగేళ్లలో 52 శాతం యూనిట్లు రోడ్డెక్కాయంటే వీటికి ఉన్న డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్‌జీ వాహనాలతో ఖర్చు తక్కువ కాబట్టే వినియోగదార్లు వీటికి మొగ్గు చూపుతున్నారు. రెండేళ్లలో సీఎన్‌జీ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 4,500 నుంచి 8,000 కేంద్రాలకు చేర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక.

టాటా నుంచి పోటీ..
సీఎన్‌జీకి ఊతమిచ్చేలా ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ సీఎన్‌ జీ వేరియంట్లను టాటా మోటార్స్‌ జనవరి 24న పరిచయం చేసింది. ఫ్యాక్టరీలో ఫిట్‌ అయిన కిట్‌తో సీఎన్‌ జీ వాహనాలు ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్‌తో రావడం దేశంలో ఇదే తొలిసారి. సంస్థ మొత్తం అమ్మకాల్లో సీఎన్‌జీ వాటా 2026 నాటికి 25 శాతానికి చేర్చాలని టాటా లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా నెక్సన్‌ సీఎన్‌జీ వేరియంట్‌ తీసుకొస్తోంది. 2022–23 ఏప్రిల్‌–జనవరిలో టాటా మోటార్స్‌ 36,963 యూని ట్ల అమ్మకాలను సాధించి మూడవ స్థానంలో ఉంది. 2024 జనవరితో ముగిసిన 10 నెలల్లో 64,972 యూనిట్లతో రెండవ స్థానానికి దూసుకు వచ్చింది.

పర్యావరణహిత వాహనాలపై కంపెనీల దృష్టి

భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పోలో వెల్లడి
దేశీయంగా ఆటోమొబైల్‌ దిగ్గజాలు పర్యావరణహిత వాహనాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2024 ఎగ్జిబిషన్‌లో పలు వాహనాలను ప్రదర్శించాయి. వీటిలో సీఎన్‌జీ, హైబ్రిడ్స్‌ మొదలుకుని ఎలక్ట్రిక్‌ వరకు వివిధ రకాల వాహనా లు ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ మోట ర్‌ ఇండియా, టాటా మోటర్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టయోటా, బీఎండబ్ల్యూ మొదలైన దిగ్గజాలు వీటిని ప్రదర్శించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ కాన్సెప్ట్‌ ఈవీఎక్స్, ఫ్లెక్స్‌–ఫ్యూయల్‌ వ్యాగన్‌ఆర్, హైబ్రీడ్‌ గ్రాండ్‌ విటారా.. జిమ్నీ, స్కైడ్రైవ్‌ ఈ–ఫ్లయింగ్‌ కారు మొదలైనవి ప్రదర్శించింది. ఈ ఏడాది తమ తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ ఈవీఎక్స్‌ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ రాహుల్‌ భారతి తెలిపారు. భారతీయ మొబిలిటీ రంగ ప్రాధాన్యాన్ని మొబిలిటీ ఎక్స్‌పో తెలియజేస్తోందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. ఎక్స్‌పో విశేషాలు..

  • మెర్సిడెస్‌ బెంజ్‌ తమ ఆఫ్‌ రోడ్‌ జీ వాగన్‌ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ’కాన్సెప్ట్‌ ఈక్యూజీ’, జీఎల్‌ఏ, ఏఎంజీ జీఎల్‌ఈ 53 కూపే వాహనాలను ప్రదర్శించింది.
  • మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ ర్యాల్‌–ఈ, ఎలక్ట్రిక్‌ ఎక్స్‌యూవీ 400, ఎలక్ట్రిక్‌ 3 వీలర్‌ ట్రియో మొదలైనవి ప్రదర్శనకు ఉంచింది.
  • ఫోర్స్‌ మోటర్స్‌ .. ట్రావెలర్‌ ఎలక్ట్రిక్, అర్బానియా డీజిల్, ట్రావెలర్‌ సీఎన్‌జీల వాహనాలను ప్రదర్శించింది.
  • ప్రదర్శనలో టాటా మోటార్స్‌ 18 ‘ఫ్యూచర్‌ రెడీ‘ కమర్షియల్, ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయి.
  • బీఎండబ్ల్యూ తమ ఈవీలు, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐ4, మినీ 3–డోర్‌ కూపర్‌ ఎస్‌ఈలను ప్రదర్శనకు ఉంచింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement