న్యూఢిల్లీ: శ్రీలంకలో చేపట్టిన కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ (సీడబ్ల్యూఐటీ) తొలి దశ 2024 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) హోల్ టైమ్ డైరెక్టర్, సీఈవో కరణ్ అదానీ తెలిపారు.
ఇందుకోసం ఏర్పాటైన కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంలోని మిగతా భాగస్వాములు తమ వంతు ఈక్విటీని సమకూర్చనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కన్సార్షియంలో ఏపీసెజ్‌తో పాటు శ్రీలంకకు చెందిన జాన్ కీల్స్ హోల్డింగ్స్ (జేకేహెచ్) శ్రీలంక పోర్ట్స్ అథారిటీ (ఎస్‌ఎల్‌పీఏ) భాగస్వాములుగా ఉన్నాయి. ఏపీసెజ్‌కు 51 శాతం, మిగతా రెండు భాగస్వామ్య సంస్థలకు కన్సార్షియంలో 49 శాతం వాటాలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన ఇంటర్నెషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీ) 553 మిలియన్ డాలర్లు సమకూరుస్తోంది. హిందూ మహాసముద్రంలో అత్యంత రద్దీగా ఉండే అతి పెద్ద నౌకాశ్రయాల్లో కొలంబో పోర్టు ఒకటి. 2021 నుంచి 90 శాతం పైగా సామర్ధ్యంతో పని చేస్తుండటంతో పోర్టును విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని తాజ్‌పూర్ పోర్టుకు సంబంధించి ఇంకా తమకు కాంట్రాక్టు కేటాయింపు జరగాల్సి ఉందని అదానీ చెప్పారు. కేటాయించాక అన్ని అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించడానికి 18–24 నెలలు పట్టొచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment