ముంబై: రెండేళ్ల పాటు తిరోగమనం తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు మరింత పుంజుకోగలవని ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ అంచనా వేస్తోంది. వివిధ విభాగాల్లో డిమాండ్ మెరుగుపడటం ఇందుకు దోహదపడగలదని ఆశిస్తోంది. కొత్త ట్రక్కుల శ్రేణిని ఆవిష్కరించిన సందర్భంగా టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ సోమవారం ఈ విషయాలు తెలిపారు. ట్రక్కుల వినియోగం, రవాణా రేట్ల పెరుగుదల, రవాణా సంస్థల విశ్వాస సూచీ మొదలైన అంశాలన్నీ సానుకూలంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
అలాగే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతుండటం వల్ల కూడా టిప్పర్ ట్రక్‌లకు డిమాండ్ పెరుగుతోందని వాఘ్ వివరించారు. 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో స్కూల్ బస్సుల సెగ్మెంట్ గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం తర్వాత నుంచి కొంత పుంజుకుందని, ఉద్యోగుల రవాణాకు ఉపయోగించే వాహనాల విభాగం కూడా మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. ‘మొత్తం మీద చూస్తే అన్ని విభాగాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది వాణిజ్య వాహనాల అమ్మకాలు బాగుంటాయని ఆశావహంగా ఉన్నాము‘ అని వాఘ్ పేర్కొన్నారు. టాటా మోటర్స్ కొత్తగా ప్రవేశపెట్టిన వాహనాల్లో తొలిసారిగా సీఎన్‌జీతో నడిచే మధ్య, భారీ స్థాయి కమర్షియల్ వాహనాలు (ఎంఅండ్‌హెచ్‌సీవీ), తేలికపాటి టిప్పర్లు, ట్రక్కులు మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు తమ ప్రైమా, సిగ్నా, అల్ట్రా ట్రక్కులలో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) తదితర కొత్త ఫీచర్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment