
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో వినియోగదారులు భారీ కోనుగోళ్ళ ఉద్దేశ్యంతో ఉన్నట్టు డెలాయిట్ తౌషే తోమట్సు ఇండియా నిర్వహించిన ‘గ్లోబల్ స్టేట్ ఆఫ్ కన్జ్యూమర్ ట్రాకర్’ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో అన్ని రకాల వయసు వారు మరింత ఖర్చు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది.
ఈ సంస్థ గడిచిన 30 రోజుల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గత మే నెలలో నిర్వహించిన సర్వేలో ఆందోళన స్థాయి 45 శాతం ఉంటే, తాజా సర్వేలో అది 39 శాతానికి తగ్గినట్టు ఈ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం విస్తృతం కావడం ప్రజల్లో ఆందోళన తగ్గడానికి కారణంగా పేర్కొంది. కార్యాలయం నుంచే పని విధానానికి తిరిగి మళ్లడాన్ని కార్పొరేట్ ఇండియా మదింపు వేస్తోందని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది.
సర్వేలో అంశాలు..
► 87% వినియోగదారులు సౌకర్యం కోసం మరింత ఖర్చుకు సానుకూలంగా ఉన్నారు.
► స్టోర్స్‌కు వెళ్లి కొనుగోళ్లు చేసుకోవడం కాస్త సురక్షితమేనని 61 శాతం మంది భావిస్తున్నారు.
► వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరయ్యే ఉద్దేశ్యంతో 51 శాతం మంది ఉన్నారు.
► 79 శాతం వినియోగదారులు తమ శారీరక ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే.. 85 శాతం తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు.
► 55 ఏళ్లపైన ఉన్న వారితో పోలిస్తే 47 ఏళ్లలోపు వయసున్న వారు ఎక్కువ పొదుపు చేస్తున్నారు.
► 35 ఏళ్లు ఆపైన వయసున్న వారు విహార యాత్రల పట్ల ఆసక్తిగా ఉంటే.. 58 శాతం మంది వినియోగదారులు తాము హోటళ్లలో బస చేయడం పట్ల సౌకర్యంగా ఉన్నామని చెప్పారు.
► ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణానికి ఎక్కువ మంది అనుకూలంగా లేరు. 79 శాతం మంది ప్రస్తుత వాహనాన్నే దీర్ఘకాలం పాటు వాడాలన్న దృఢ నిర్ణయంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment