న్యూఢిల్లీ: భారత్ స్వావలంబన సాధించడంలో సహకార రంగం కీలక పాత్ర పోషించగలదని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మరింత మెరుగైన జీవితం సాగించాలన్న 70 కోట్ల మంది పేదల ఆకాంక్షలను సాకారం చేసేందుకు, వారు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పాటు అందించగలదని పేర్కొన్నారు. సహకార సంఘాల 100వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం గరీబీ హటావో నినాదాలకే పరిమితం కాగా మోదీ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లలో పేదల అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. కోఆపరేటివ్ రంగాన్ని పటిష్టం చేసేందుకు సహకార శాఖ పలు చర్యలు తీసుకుంటోందని షా వివరించారు. నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు .. అకౌంటింగ్, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ మొదలైన అంశాల్లో కోర్సులు అందించేందుకు కోఆపరేటివ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
63,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలను (పీఏసీఎస్) దాదాపు రూ. 2,516 కోట్లతో కంప్యూటరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు షా వివరించారు. దీనితో అకౌంటింగ్, ఖాతాల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. పీఏసీఎస్‌లు ఇతరత్రా కార్యకలాపాల్లోకి కూడా విస్తరించేందుకు వీలుగా నమూనా బై–లాస్ ముసాయిదాను రూపొందించినట్లు చెప్పారు. పీఏసీఎస్‌లు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి కాబట్టి దీనిపై రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కూడా సలహాలు తీసుకుంటున్నామని వివరించారు. దేశీయంగా ప్రస్తుతం 8.5 లక్షల కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment