న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 సోకినవారికి విరివిగా వినియోగిస్తున్న ఔషధాలలో రెమ్‌డెసివిర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రధానంగా ఆసుపత్రులలో చేరిన రోగులలో ఈ ఔషధం ఎలాంటి గుణమూ చూపించడంలేదని డబ్ల్యూహెచ్‌వో ప్యానల్ పేర్కొంది. సాలిడారిటీ ట్రయల్స్‌లో ఈ అంశాలు బయటపడినట్లు తెలియజేసింది. రెమ్‌డెసివిర్ ఔషధ వినియోగం వల్ల మరణాల సంఖ్య తగ్గడం లేదా మెకానికల్ వెంటిలేషన్ అవసరాన్ని తగ్గించడం, త్వరగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించలేదని నివేదిక అభిప్రాయపడింది. దీంతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు ఈ ఔషధాన్ని వినియోగించవద్దంటూ సూచించింది. ఆసుపత్రులలో 28 రోజులపాటు నిర్వహించిన సాలిడారిటీ ట్రయల్స్‌లో ఈ విషయాలు గమనించినట్లు తెలియజేసింది. అమెరికాసహా 50 ప్రపంచ దేశాలలో రెమ్‌డెసివిర్ ఔషధాన్ని కోవిడ్-19 చికిత్సలో వినియోగిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ప్యానల్ నివేదికకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్-19 చికిత్సలో ఈ ఔషధాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు సైతం వినియోగించడం గమనార్హం.
గిలియడ్ ఏమంటున్నదంటే
రెమ్‌డెసివిర్ ఔషధ తయారీ కంపెనీ గిలియడ్ సైన్సెస్ సాలిడారిటీ ట్రయల్స్ ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించింది. ఈ ఔషధాన్ని ఆసుపత్రులలో చేరిన రోగుల చికిత్సలో వినియోగించేందుకు పలు జాతీయ సంస్థలు మార్గదర్శకాలను జారీ చేసినట్లు ప్రస్తావిస్తోంది. ఈ అంశాలను డబ్ల్యూహెచ్‌వో నిర్లక్ష్యం చేయడం తమను నిరాశపరచినట్లు పేర్కొంది. వెల్కూరీ బ్రాండుతో కంపెనీ రెమ్‌డెసివిర్ ఔషధాన్ని విక్రయిస్తోంది. వెల్కూరీని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు కోవిడ్-19 చికిత్సలో నమ్మకంగా వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. కోవిడ్-19 రోగుల చికిత్సలో వినియోగించేందుకు యాంటీవైరల్ ట్రీట్‌మెంట్‌కింద అనుమతులు పొందిన తొలి ఔషధం వెల్కూరీ అని తెలియజేసింది. కాగా.. రెమ్‌డెసివిర్ ఔషధ అమ్మకాలతో కనిపిస్తున్న అనిశ్చితి కారణంగా ఇటీవల కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం గమనార్హం.
గ్రూప్ సమీక్ష ఇలా
అంతర్జాతీయ స్థాయిలో నాలుగు ప్రాంతాల నుంచి 7,000 మందికిపైగా రోగుల పరీక్షలలో క్రోడీకరించిన డేటా ఆధారంగా రెమ్‌డెసివిర్ ఔషధంపై మార్గదర్శకాలను జారీ చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో గైడ్‌లైన్ డెవలప్‌మెంట్ గ్రూప్(జీడీజీ) ప్యానల్ వెల్లడించింది. అయితే రెమ్‌డెసివిర్ ఔషధ క్లినికల్ పరీక్షలను సమర్థించింది. కొంతమంది రోగులపై చేపట్టిన పరీక్షలలో కనిపిస్తున్న ఫలితాల కారణంగా వీటిని సమర్థిస్తున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment