సాక్షి, బెంగళూరు/బనశంకరి: దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సుడిగుండంలో చిక్కుకొని హోటళ్ల రంగం విలవిలలాడుతోంది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే ఈరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాలు భరించే శక్తిలేక 10 నుంచి 15 శాతం వరకు యజమానులు తమ హోటళ్లను విధిలేని పరిస్థితుల్లో విక్రయానికి పెట్టారు. ఉద్యోగాల వేటలో విసిగిపోయిన ఎంతో మంది చిన్నపాటి హోటల్స్ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. హోటళ్ల యజమానుల సంఘం సమాచారం ప్రకారం రాష్ట్రంలో 70వేల హోటల్స్, రెస్టారెంట్లు ఉండగా ఒక్క బెంగళూరు నగరంలో 25 వేల హోటళ్లు, రెస్టారెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
కరోనా నిబంధనలు, లాక్‌డౌన్ వెరసి ఏడాదిన్నర కాలంగా హోటళ్ల యజమానులు ఆర్థికంగా దెబ్బతిన్నారు కరోనాతో లాక్‌డౌన్ వల్ల నెలల పాటు హోటల్స్ మూతపడ్డాయి. ఒక రూపాయి కూడా ఆదాయం లేకపోగా లక్షలాది రూపాయల అద్దె, వంటపనివారు, సహాయకులకు వేతనాలు చెల్లించలేని స్థితిలో యజమానులు ఉన్నారు. దీంతో చాలా మంది హోటల్స్‌ను విక్రయానికి ఉంచారు. వీరిలో ఒకటికంటే ఎక్కువ హోటళ్లు కలిగిన కొందరు యజమానులే అధికం. మొత్తం పదివేల వరకు హోటళ్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా హోటల్స్‌ను కొనేవారు లేక వాటిని లీజుకు ఇవ్వాలనే యోచనలో కొందరు యజమానులు ఉన్నారు.
బెంగళూరులో 10 శాతం హోటళ్లకు నష్టాలు
తమిళనాడులో 30 శాతం హోటళ్లను యజమానులు విక్రయానికి పెట్టడం గమనించామని, కర్ణాటకలో 10 శాతం హోటల్స్‌ను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం ఉందని బెంగళూరునగర హోటల్ యజమానుల సంఘం కార్యదర్శి పీసీ.రావ్ ప్రకారం తెలిపారు. సుమారు 6 వేల హోటళ్లను ఇప్పటికే మూసివేశారన్నారు. అన్‌లాక్ నేపథ్యంలో కొందరు యజమానులు ఇటీవల మళ్లీ అప్పులు చేసి హోటళ్లు తెరిచారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment