డీప్‌ఫేక్! ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసే ఈ టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. క్రియేటివ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూపొందించిన ఈ టెక్నాలజీతో ఇటీవల మోసాలు పెరిగిపోయాయి.
కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ రష్మిక విషయంలో జరిగిందిదే. డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వేరే అమ్మాయి వీడియోను మార్షింగ్ చేసి రష్మికలా రూపొందించడంతో దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఇలా వీడియోలు చేయడమే కాదు.. ఫోన్‌లో వీడియో కాల్ చేసి నిమిషాల వ్యవధిలో వందల కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా, బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన హాంకాంగ్ కార్యాలయం డీప్‌ఫేక్ వీడియో కాల్ కుంభకోణంలో చిక్కుకుంది. ఫలితంగా 15నిమిషాల్లో 200 కోట్లు పోగొట్టుకుంది.
సైబర్ నేరస్తులు వీడియో కాల్ సమయంలో సదరు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) పోలి ఉండేలా డీప్‌ఫేక్ వీడియోను తయారు చేశారు. ఇందుకోసం యూట్యూబ్‌లో దొరికే వీడియోల్ని ఉపయోగించుకున్నారు. ఆపై వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అచ్చం మనుషులను పోలి ఉండేలా డీప్ ఫేక్ ప్రతి రూపాలను రూపొందించారు.
అనంతరం స్కామర్లు కంపెనీ సీఎఫ్‌ఓ డీప్‌ఫేక్ వీడియోలో తాను చెప్పినట్లుగా ఐదు హాంకాంగ్ బ్యాంక్ ఖాతాలకు 25.6 మిలియన్ల మొత్తాన్ని 15 బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. సీఎఫ్‌ఓ ఆదేశాలతో ఉద్యోగులు వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా డీప్‌ఫేక్ వీడియో కాల్‌లో నిందితులు చెప్పినట్లు చేశారని సీనియర్ సూపరింటెండెంట్ బారన్ చాన్ షున్ చింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారడంతో డీప్‌ఫేక్ వీడియోల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment