
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివోకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. బ్యాంకుల ఖాతాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే 945 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. అలాగే రూ. 250 కోట్ల బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఆయా ఖాతాలను ఆపరేట్ చేసుకోవచ్చని తెలిపింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు, బ్యాంకు ఖాతాల స్వాధీనంపై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, జస్టిస్ సుబ్రమణియంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవలి ఈడీ దాడులు, బ్యాంకు ఖాతాల సీజ్‌పై వివో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తే 2,826 కోట్ల రూపాయల నెలవారీ జీతాలు చెల్లించలేమని పేర్కొంది. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. వివో తరపున సీనియర్ న్యాయ వాదులు సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదిస్తూ బ్యాంకు ఖాతాలను సీజ్ వల్ల వివో కార్యకలాపాలు నిలిచి పోయాయని వాదించారు.
కాగా పన్నులు ఎగవేసేందుకు దేశంలో ఆదాయాన్ని తక్కువ చూపించి కోట్ల రూపాయలను చైనాకు తరలించిందనే ఆరోపణలపై ఈడీ జూలై 5న దేశవ్యాప్తంగా వివో కార్యాలయాలపై విస్తృత దాడులు చేసింది. 119 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.465 కోట్లను స్వాధీనం చేసుకుంది. మరో రూ.73 లక్షల నగదు, రెండు కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేసింది. భారత్‌లో పన్నులు ఎగవేసేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో 2017-21 మధ్యకాలంలో రూ.62,476 కోట్ల టర్నోవర్‌ను చైనాలోని మాతృసంస్థకు తరలించిందని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment