ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ టెక్నాలజీస్ మళ్లీ భారీ సంఖ్యలో తొలగింపులను ప్రకటించింది. గత 15 నెలల్లో ఇది రెండవ రౌండ్ లేఆఫ్. కంపెనీ ఈసారి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దాని మొత్తం వర్క్ ఫోర్స్‌లో దాదాపు 10 శాతం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉద్దేశించిన విస్తృత పునర్వ్యవస్థీకరణలో ఈ తొలగింపులు భాగం. తమ కస్టమర్ సంస్థలకు ఏఐ ద్వారా మెరుగైన సేవలు అందించి మార్కెట్ వృద్ధిని పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
తొలగింపుల నిర్ణయాన్ని కంపెనీ గ్లోబల్ సేల్స్ అండ్ కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ ఛానెల్స్ ప్రెసిడెంట్ జాన్ బైర్న్ మెమో ద్వారా తెలియజేశారు. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమే అయినప్పటికీ భవిష్యత్ వృద్ధి కోసం అనివార్యమైనట్లు పేర్కొన్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు హెచ్‌ఆర్ ఎగ్జిట్ మీటింగ్‌ల ద్వారా తెలియజేశారు.
కొందరికి వన్-ఆన్-వన్ మీటింగ్‌ల ద్వారా ఈ విషయం తెలిసింది. బాధిత ఉద్యోగులకు రెండు నెలల వేతనాలతో పాటు సంవత్సరానికి అదనంగా ఒక వారం, గరిష్టంగా 26 వారాల వరకు సీవెరన్స్ ప్యాకేజీలు అందిస్తున్నారు. అయితే ప్రోత్సాహకాలు, స్టాక్ ఆప్షన్లు కోల్పోవడంపై దీర్ఘకాలిక ఉద్యోగులలో అసంతృప్తి ఉంది. ఇటీవలి బడ్జెట్ తగ్గింపులు, రద్దైన ప్రాజెక్ట్‌లను గమనించిన కొంతమంది ఉద్యోగులు కోతలను ముందే ఊహించారు.
డెల్ ఇప్పటికే 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 13,000 మంది ఉద్యోగులను తొలగించింది. రిమోట్-వర్క్ విధానాన్ని రద్దు చేస్తూ, గత సంవత్సరం ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు పిలవాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం కూడా సిబ్బందిని తగ్గించడంలో భాగంగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుత తొలగింపులతో డెల్ వర్క్‌ఫోర్స్ 1.2 లక్షల నుంచి 1లక్ష దిగువకు తగ్గుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment