గత ఎన్నో ఏళ్లుగా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం.. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసి, సంపాదించడం, సంసార బాధ్యతలను నిర్వర్తిస్తుండటం. ఇలా మన దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి జనాల్లో ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారెందరో ఉన్నారు. ఎన్నో కారణాల వల్ల వేర్వేరు స్థలాల్లో పని చేసే భార్యాభర్తలు ఉన్నారు. ప్రస్తుతం ఒకే ప్రాంతంలో, ఒకే ఇంట్లో కలిసి కాపురం చేస్తూ పన్ను పరిధిలోకి వచ్చే భార్యాభర్తల అంశం చూద్దాం. ఒకే ఇంట్లో అద్దె చెల్లిస్తున్న భార్యభర్తలు .. తమ తమ ఆదాయంలో నుంచి ఇంటద్దెను ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం. ఉదాహరణకు.. ఒక జంట.. ఒకే హోదా, ఇంచుమించుగా సమానమైన జీతభత్యాలు అందుకుంటూ ఒకే ప్రాంతం, ఒకే ఇంట్లో అద్దె చెల్లిస్తూ, జీవిస్తున్నారనుకుందాం. ఇంటద్దె రూ. 40,000 అనుకుందాం. సాధారణంగానే పన్ను భారం ఎలా తగ్గించుకోవాలన్నది ప్రతి వారూ ఆలోచిస్తారు. ఇందుకోసం ప్లానింగ్ చేసుకోవడంలోనూ తప్పు లేదు. అయితే, ఇలాంటి సందర్భాల్లో చాలా మంది చేసే పొరపాటు.. ఇద్దరూ విడివిడిగా తమ సంస్థలకు సబ్మిట్ చేసే స్టేట్‌మెంట్లలో ఇంటద్దెను చూపించి, మినహాయింపు పొందుతుంటారు. ఇలా చేయడం తప్పు. వారి వాదన ఏమిటంటే యజమాని వేరు.. అసెస్‌మెంట్ చేసే అధికారులు వేరు .. ఎవరికీ ఏమీ తెలియదు.. భార్య పాన్‌కార్డులో భర్త పేరుండదు.. తన తండ్రి పేరు ఉంటుంది కాబట్టి ఎవరూ కనిపెట్టలేరు .. అలాగే భర్త పాన్‌కార్డులో తన తండ్రి పేరు ఉంటుంది ... వీళ్లిద్దరూ భార్యాభర్తలని తెలుసుకోవడం కష్టమని అనుకుంటూ ఉంటారు. యజమాని సంస్థలోని అధికారులు కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తారు. ’ఒక కాగితం, రశీదు, పాన్‌కార్డు ఓనరుది ఇవ్వండి చాలు’ అని సరిపెట్టేస్తారు.
కృత్రిమ మేధతో పసిగట్టేస్తారు..జాగ్రత్త..
ఇప్పుడు అసెస్‌మెంట్లు ఇదివరకులా జరగడం లేదు. కృత్రిమ మేధస్సు ద్వారా ఎన్నో విషయాలను పసిగడుతున్నారు. కాబట్టి ఇద్దరూ మినహాయింపు క్లెయిమ్ చేయకండి. ఎవరి జీతం/ఆదాయం ఎక్కువ ఉందో వారే క్లెయిమ్ చేయకండి. మిగతావారు చేయకండి. లేదా ఇద్దరూ చెరో సగం చేయండి. నిజంగా అద్దె చెల్లించకుండా ఇంటద్దె మినహాయింపు పొందవద్దు. తాతగారిల్లు అనో.. మావగారి ఇల్లు అనో తప్పుడు క్లెయిమ్ చేసి, దొంగ సంతకాలు ఎడమ చేతితో పెట్టి రశీదులు ఇవ్వకండి. యజమాని సంస్థలో పనిచేసే ఉద్యోగి సహకారం, సహాయం తప్పుగానే భావించండి. ఆ తప్పుడు డిక్లరేషన్లు నిలవవు. ఏదో ఒక కాగితంలే.. ఏదో ఒక రశీదులే అని తేలికగా తీసిపారెయ్యకండి. ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వారే ఇవ్వాలి. స్వర్గస్తులైన వారి పేరు మీద కూడా కొందరు దొంగ రశీదులపై సంతకాలు చేస్తున్నారు. గంతకు తగ్గ బొంతలాగా ఓనర్లు కూడా అలాగే ఉంటున్నారు. ‘మా అబ్బాయి ఇల్లు. వాడు అమెరికాలో ఉంటాడు. రెంటు నా అకౌంటులో పడుతుంది. ఈ రెంటు నాది కాదు‘ అని చూపించడం మానేసిన వాళ్లు కూడా ఉంటున్నారు. అది తప్పు. అలాంటిదేదైనా ఉంటే మీ అబ్బాయి అకౌంటులోనే చూపించండి. ఒకవేళ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ పన్ను భారం తగ్గించుకునేందుకు అద్దెకు ఉన్నట్లు చెప్పే బదులు.. నిజంగానే అద్దె ఇవ్వండి. అది మీకు ఖర్చు కాబట్టి అందుకు మినహాయింపు పొందండి. భార్యభర్తల విషయంలో ఒకరే మినహాయింపు పొందండి. భార్యభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి నిజంగానే అద్దె చెల్లిస్తున్నట్లయితే మినహాయింపు పొందండి. మీ కుటుంబ సభ్యులకే అద్దె చెల్లిస్తున్నట్లయితే, దాన్ని వారి ఆదాయంలో ఇంటద్దెగా చూపించమనండి.
Comments
Please login to add a commentAdd a comment