House Rents
-
అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో అద్దెలు హడలెత్తిస్తున్నాయి. మూడు నెలల్లో కిరాయిలు 1–4 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, ఆఫీసులకు దగ్గరగా ఉన్న చోట, అలాగే మెట్రో కనెక్టివిటీ, ఇతర రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో నెలవారీ అద్దెలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని అనరాక్ అధ్యయనంలో వెల్లడైంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో 1000-1,300 చదరపు అడుగుల 2 బీహెచ్‌కే ఫ్లాట్ ధరలను పరిశీలిస్తే.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, కొండాపూర్ వంటి ప్రాంతాలలో నెలవారీ అద్దె అర లక్ష రూపాయలకు పైగానే ఉంటోంది. -
హైదరాబాద్ లో మోత మోగుతున్న ఇళ్ల అద్దెలు
-
చుక్కలనంటుతున్న ‘అద్దెలు’,కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు
బ్రిటన్‌లో లివర్‌పూల్ శివార్లలోని నారిస్ గ్రీన్ ప్రాంతానికి చెందిన గాలింగేల్ రోడ్‌ను ఇప్పుడంతా ‘దెయ్యాలవీథి’ గా పిలుచు కుంటున్నారు. ఎందుకలా? అక్కడేమైనా క్షుద్రపూజల వంటివి జరుగుతున్నాయా? అతీంద్రియ శక్తుల కదలికలేమైనా ఉన్నాయా? అంటే, అలాంటివేమీ లేవు. మరి దెయ్యాలవీథిగా పేరు ఎందుకొచ్చిందనేగా మీ అనుమానం? లండన్ తర్వాత బ్రిటన్‌లో ఖరీదైన ప్రాంతాల్లో లివర్‌పూల్ ఒకటి. లివర్‌పూల్ నడిబొడ్డునే కాదు, శివారు ప్రాంతాల్లో కూడా ఇటీవల ఇళ్ల అద్దెలు చుక్కలనంటే స్థాయిలో పెరిగాయి. గాలింగేల్ రోడ్‌లోనూ ఇళ్ల అద్దెలు జనాల తాహతుకు మించి పెరగడం మొదలవడంతో, ఇంతకాలం ఇక్కడ ఉంటూ వచ్చిన వారిలో చాలామంది ఒక్కొక్కరుగా ఇళ్లు ఖాళీచేసి వేరేచోటుకు తరలి పోయారు. ఇంకా మిగిలిన ఒకటీ అరా కుటుంబాల వారు కూడా వీలైనంత త్వరలోనే ఇక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని వేరేచోటుకు తరలిపోయే ఆలోచనల్లో ఉన్నారు. దాదాపు తొంభై శాతానికి పైగా ఇళ్లు ఖాళీ కావడంతో ఈ వీథి వీథంతా కొన్ని నెలలుగా నిర్మానుష్యంగా మారింది. దీంతో స్థానికులు ఈ ప్రాంతాన్ని ‘ఘోస్ట్ స్ట్రీట్’గా పిలుచుకుంటున్నారు. ‘ఇంటి అద్దె ఒకేసారి 680 పౌండ్ల (రూ.65 వేలు) నుంచి 750 పౌండ్లకు (71 వేలు) పెరిగింది. ఈ అద్దె భరించడం మాకు శక్తికి మించిన పని. త్వరలోనే ఇల్లు ఖాళీచేసి వేరేచోటుకు వెళ్లిపోదామనుకుంటున్నాం. ఇక్కడ మిగిలిన ఒకటీ అరా కుటుంబాల వారు కూడా ఇతర ప్రాంతాల్లో ఇళ్ల కోసం వెదుకులాడుతున్నారు. తగిన ఇల్లు దొరికితే ఈ వీథిని ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఉన్న కాసిని కుటుంబాలు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే పూర్తిగా ఇది ‘ఘోస్ట్స్ట్రీట్’గానే మిగులుతుంది’ అని ఆండీ అనే ఈ ప్రాంతవాసి తెలిపారు. -
భార్యాభర్తలు.. ఒక్కరికే పన్ను మినహాయింపు
గత ఎన్నో ఏళ్లుగా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం.. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసి, సంపాదించడం, సంసార బాధ్యతలను నిర్వర్తిస్తుండటం. ఇలా మన దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి జనాల్లో ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారెందరో ఉన్నారు. ఎన్నో కారణాల వల్ల వేర్వేరు స్థలాల్లో పని చేసే భార్యాభర్తలు ఉన్నారు. ప్రస్తుతం ఒకే ప్రాంతంలో, ఒకే ఇంట్లో కలిసి కాపురం చేస్తూ పన్ను పరిధిలోకి వచ్చే భార్యాభర్తల అంశం చూద్దాం. ఒకే ఇంట్లో అద్దె చెల్లిస్తున్న భార్యభర్తలు .. తమ తమ ఆదాయంలో నుంచి ఇంటద్దెను ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం. ఉదాహరణకు.. ఒక జంట.. ఒకే హోదా, ఇంచుమించుగా సమానమైన జీతభత్యాలు అందుకుంటూ ఒకే ప్రాంతం, ఒకే ఇంట్లో అద్దె చెల్లిస్తూ, జీవిస్తున్నారనుకుందాం. ఇంటద్దె రూ. 40,000 అనుకుందాం. సాధారణంగానే పన్ను భారం ఎలా తగ్గించుకోవాలన్నది ప్రతి వారూ ఆలోచిస్తారు. ఇందుకోసం ప్లానింగ్ చేసుకోవడంలోనూ తప్పు లేదు. అయితే, ఇలాంటి సందర్భాల్లో చాలా మంది చేసే పొరపాటు.. ఇద్దరూ విడివిడిగా తమ సంస్థలకు సబ్మిట్ చేసే స్టేట్మెంట్లలో ఇంటద్దెను చూపించి, మినహాయింపు పొందుతుంటారు. ఇలా చేయడం తప్పు. వారి వాదన ఏమిటంటే యజమాని వేరు.. అసెస్మెంట్ చేసే అధికారులు వేరు .. ఎవరికీ ఏమీ తెలియదు.. భార్య పాన్‌కార్డులో భర్త పేరుండదు.. తన తండ్రి పేరు ఉంటుంది కాబట్టి ఎవరూ కనిపెట్టలేరు .. అలాగే భర్త పాన్‌కార్డులో తన తండ్రి పేరు ఉంటుంది ... వీళ్లిద్దరూ భార్యాభర్తలని తెలుసుకోవడం కష్టమని అనుకుంటూ ఉంటారు. యజమాని సంస్థలోని అధికారులు కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తారు. ’ఒక కాగితం, రశీదు, పాన్‌కార్డు ఓనరుది ఇవ్వండి చాలు’ అని సరిపెట్టేస్తారు. కృత్రిమ మేధతో పసిగట్టేస్తారు..జాగ్రత్త.. ఇప్పుడు అసెస్మెంట్లు ఇదివరకులా జరగడం లేదు. కృత్రిమ మేధస్సు ద్వారా ఎన్నో విషయాలను పసిగడుతున్నారు. కాబట్టి ఇద్దరూ మినహాయింపు క్లెయిమ్ చేయకండి. ఎవరి జీతం/ఆదాయం ఎక్కువ ఉందో వారే క్లెయిమ్ చేయకండి. మిగతావారు చేయకండి. లేదా ఇద్దరూ చెరో సగం చేయండి. నిజంగా అద్దె చెల్లించకుండా ఇంటద్దె మినహాయింపు పొందవద్దు. తాతగారిల్లు అనో.. మావగారి ఇల్లు అనో తప్పుడు క్లెయిమ్ చేసి, దొంగ సంతకాలు ఎడమ చేతితో పెట్టి రశీదులు ఇవ్వకండి. యజమాని సంస్థలో పనిచేసే ఉద్యోగి సహకారం, సహాయం తప్పుగానే భావించండి. ఆ తప్పుడు డిక్లరేషన్లు నిలవవు. ఏదో ఒక కాగితంలే.. ఏదో ఒక రశీదులే అని తేలికగా తీసిపారెయ్యకండి. ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వారే ఇవ్వాలి. స్వర్గస్తులైన వారి పేరు మీద కూడా కొందరు దొంగ రశీదులపై సంతకాలు చేస్తున్నారు. గంతకు తగ్గ బొంతలాగా ఓనర్లు కూడా అలాగే ఉంటున్నారు. ‘మా అబ్బాయి ఇల్లు. వాడు అమెరికాలో ఉంటాడు. రెంటు నా అకౌంటులో పడుతుంది. ఈ రెంటు నాది కాదు‘ అని చూపించడం మానేసిన వాళ్లు కూడా ఉంటున్నారు. అది తప్పు. అలాంటిదేదైనా ఉంటే మీ అబ్బాయి అకౌంటులోనే చూపించండి. ఒకవేళ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ పన్ను భారం తగ్గించుకునేందుకు అద్దెకు ఉన్నట్లు చెప్పే బదులు.. నిజంగానే అద్దె ఇవ్వండి. అది మీకు ఖర్చు కాబట్టి అందుకు మినహాయింపు పొందండి. భార్యభర్తల విషయంలో ఒకరే మినహాయింపు పొందండి. భార్యభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి నిజంగానే అద్దె చెల్లిస్తున్నట్లయితే మినహాయింపు పొందండి. మీ కుటుంబ సభ్యులకే అద్దె చెల్లిస్తున్నట్లయితే, దాన్ని వారి ఆదాయంలో ఇంటద్దెగా చూపించమనండి. -
గృహ విక్రయాలు, ఆఫీస్ అద్దెలపై కరోనా పడగ
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో భారత్ ఎనిమిది ప్రధాన నగరాల్లో 2020 జూలై–సెప్టెంబర్ (2019 ఇదే కాలంతో పోల్చి) మధ్య గృహ విక్రయాలు 43 శాతం పడిపోయాయి. కార్యాలయాల (స్పేస్) అద్దెల విషయంలో 70% క్షీణ రేటు నమోదయ్యింది. కరోనాను ఎదుర్కొనేందుకు అమలు చేసిన కఠిన లాక్డౌన్ పర్యవసానాల నేపథ్యం ఇది. అయితే లాక్డౌన్ అమలు జరిగిన ఏప్రిల్–జూన్ కాలంతో పోల్చితే, తాజా సమీక్షా త్రైమాసికం జూలై–సెప్టెంబర్ మధ్య పరిస్థితి కొంత బాగుండడం ఊరటనిస్తున్న అంశం. వరుస త్రైమాసికాల ప్రాతిపదికన చూస్తే, జూలై– సెప్టెంబర్ మధ్య గృహ విక్రయాలు మూడు రెట్లు పెరిగితే, ఆఫీస్ స్పేస్ లీజ్ విషయంలో 81% వృద్ధి నమోదయ్యింది. రియల్టీ దిగ్గజ సంస్థ– నైట్ ఫ్రాంక్ ఇండియా సర్వే నివేదిక ఈ అంశాలను వెలువరించింది. సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... 2020 జూలై–సెప్టెంబర్ మధ్య ఎనిమిది నగరాల్లో గృహ విక్రయాలు 43 శాతం పడిపోయి 33,403గా నమోదయ్యాయి. 2019 ఇదే కాలంలో ఈ విక్రయాల సంఖ్య 58,183. ఇక ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయానికి వస్తే, 15.7 మిలియన్ల చదరపు అడుగుల నుంచి 4.7 మిలియన్ల చదరపు అడుగులకు పడిపోయింది. అనరాక్, ప్రాప్‌ఈక్విటీలూ ఇదే చెప్పాయ్... దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్ మధ్య ఇళ్ల అమ్మకాల విషయంలో ఇప్పటికే ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్, రియల్ ఎస్టేట్ రంగ సమాచార విశ్లేషణా సంస్థ ప్రాప్‌ఈక్విటీలు తమ నివేదికలను విడుదల చేశాయి. ఈ కాలాన్ని వార్షికంగా పరిశీలిస్తే, ఇల్లు/ప్లాట్ల అమ్మకాలు 53% పడిపోయి 78,472 నుంచి 50,983 చేరినట్లు ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ , చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణెలను ఈ సంస్ధ పరిగణనలోకి తీసుకుంది. అయితే జూన్ క్వార్టర్లో నమోదైన విక్రయాలు 24,936 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో రెట్టింపయ్యాయని తెలిపింది. ఇక అనరాక్ నివేదికను తీసుకుంటే, సెప్టెంబర్ క్వార్టర్లో 46% పతనంతో 29,520 యూనిట్లు అమ్ముడపోయాయని, క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 55,080 యూనిట్లని తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణెలను సంస్థ పరిగణనలోకి తీసుకుంది. జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు కేవలం 12,730 యూనిట్లుగా పేర్కొంది. కాగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతోందని, కరోనా తర్వాత భారీ సంఖ్యలో చిన్న పట్టణాలకు తిరిగి వలసపోవడమే కారణమని హౌసింగ్ డాట్ కామ్ ఇటీవల ఆవిష్కరించిన నివేదిక తెలియజేసింది. కష్టాలు ఉన్నాయ్! 'జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో సంఖ్యలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, కష్టాలు తొలగిపోలేదు. కమర్షియల్ లీజింగ్ క్రియాశీలత కుదుటపడుతోంది. గృహ అమ్మకాలు, ఆఫీస్ లీజింగ్ విషయంలో 2019 స్థాయిని 2021లో చేరుకోవచ్చు. 2019కన్నా మెరుగ్గా పరిస్థితి ఉండే అవకాశాలూ లేకపోలేదు' అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ అన్నారు. -
అద్దెల వెనుక..అక్రమాలు
మునిసిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ మడిగెల అద్దె వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అద్దెను తక్కువకు కేటాయించి కమీషన్లు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నర్సంపేట : నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్లోని చాపల మార్కెట్, బాలికల పాఠశాల, సెంట్రల్ బ్యాంక్, నెహ్రు పార్కు, మునిసిపాలిటీ ముందు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మునిసిపాలిటీకి చెందిన మొత్తం 64 షాపులను అద్దెకు కేటాయించారు. వాస్తవానికి షాపుల అద్దెను రెన్యూవల్ ద్వారా కాకుండా టెండర్లతో కేటాయిస్తే మూడు రెట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే మూడు సంవత్సరాలకు ఒక్కసారి 33శాతం అద్దె పెంచుతూ రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నారు. అంబేద్కర్ సెంటర్లోని చేపల మార్కెట్ సమీపంలో ఉన్న మునిసిపాలిటీ షాపులకు నెలకు గతంలో రూ.2700 చొప్పున అద్దె నిర్ణయించారు. దీంతో ప్రతి ఏడాది రూ.25లక్షలు ఆదాయం వస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. వాస్తవానికి అంతే విస్తీర్ణంలో ఉన్న ప్రైవేట్ షాపులకు మార్కెట్లో రూ.6వేల నుంచి రూ.7వేల వరకు అద్దె ఉంది. ఈ వ్యత్యాసం చూస్తే ప్రతీ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రైవేట్ షాపుల కంటే సగం అద్దెకు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో ప్రతి ఏడాది మరో రూ.25 లక్షల ఆదాయం కోల్పోతోంది. 13 ఏళ్లుగా ఇదే తంతు.. షాపింగ్ కాంప్లెక్స్‌లకు 2005 సంవత్సరంలో టెండర్ల ద్వారా అద్దెలు నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా ప్రతీ సారి అద్దె 33శాతం పెంచి రెన్యూవల్తోనే కొనసాగిస్తున్నారు. దీంతో రూ.కోటికి పైగానే ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది. అధికారుల కనుసన్నల్లోనే.. మునిసిపాలిటీ పరిధిలో పనిచేసే అధికారుల కనుసన్నల్లోనే అద్దెల వ్యవహారం కొనసాగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నా యి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నర్సంపేట 2011లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. టెండర్లు నిర్వహించిన 2005 నుంచి ఆరు సంవత్సరాల పాటు నలుగురు ఈఓపీఆర్డీలు మారారు. 2011 నుంచి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన 2018 వరకు ముగ్గురు కమిషనర్లు మారారు. మొత్తం ఏడుగురు అధికారులు మారినా షాపింగ్ కాప్లెక్స్లకు రెన్యూవల్తోనూ అద్దెలకు కేటాయించారు. కొన్నిచోట్ల ఒక్కరికే రెండు షాపులను కేటాయించి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. తక్కువ అద్దెకు షాపులు కేటాయించి సదరు యజమానులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కమీషన్లు దండుకుంటూ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారైనా సక్రమంగా జరిగేనా.. భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ సారి కూడా రెన్యూవల్ పద్ధతిన గట్టెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 64 షాపులలో 75శాతం వాటికి గత మార్చి 31వ తేదీతో గడువు ముగిసిపోయింది. వాటికి వచ్చే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి అద్దెను నిర్ణయించే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి మునిసిపాలిటీకి జరుగుతున్న నష్టాన్ని పాలకవర్గం అడ్డుకుని ఆదాయం పెంచుకుని అభివృద్ధికి బాటలు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నష్టం జరగకుండా చూస్తాం.. మునిసిపాలిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దె పెంచేందుకు సర్వే చేయిస్తాం. ప్రైవేట్ షాపుల అద్దెతో పోల్చి సరాసరి అద్దెను నిర్ణయించి నష్టం జరగకుండా చూస్తాం. ఒకే వ్యక్తికి రెండు షాపులు కేటాయించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం. మునిసిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారమే షాపులను కేటాయించేలా కౌన్సిల్ సమావేశంలో నిర్ణయిస్తాం. -
ఇళ్ల అద్దెలూ ఆకాశానికి
* రాజధాని ప్రచారంతో రెట్టింపైన ఇళ్ల అద్దెలు * విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో జోరుగా అద్దెల వ్యాపారం * అద్దె పెంచేందుకు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్న యజమానులు * ఏదో ఒకసాకుతో ఖాళీ చేయించడం, లేకుంటే అవస్థలు పెట్టడం * ఇంటి యజమాని, కిరాయిదారుల మధ్య పెరుగుతున్న వివాదాలు సాక్షి, విజయవాడ బ్యూరో: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు కొత్త రాజధాని ప్రచారం అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో రెండు నెలలుగా ఇళ్ల అద్దెలు మెట్రో నగరాలతో పోటీ పడుతున్నాయి. భూముల కొనుగోలు, అమ్మకాల కోసం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాదిరే ఇప్పుడు రెంటల్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు పుట్టుకొచ్చాయి. విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నుంచి రాష్ర్ట మంత్రుల వరకు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ నేతలు కూడా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు ఆఫీసు పెడితే చంద్రబాబు బస చేసేందుకు గురునానక్ కాలనీలో ఒక ఇంటిని ఇటీవల పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమ ఇప్పటికే క్యాంపు ఆఫీసు పెట్టారు. జిల్లాలోని మరో ఇద్దరు మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్రలు క్యాంపు ఆఫీసుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కూడా విజయవాడలో ఇంటి వేటలోపడ్డారు. దీనికి తోడు కొన్ని రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఏజెన్సీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విజయవాడ, గుంటూరు నగరాలకు క్యూ కడుతున్నాయి. దీంతో విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లోని ఇళ్ల యజమానులు విపరీతంగా ఇంటి అద్దెలు పెంచేశారు. రెండు నెలల్లోనే అద్దెల భారం పెరగడంతో మధ్యతరగతి ఉద్యోగులు, చిరు వ్యాపారులు తమ సంపాదనలో సగం అద్దె కట్టడానికే సరిపోతోందని ఆవేదన చెందుతున్నారు. విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో రాణిస్తున్న విజయవాడ ఇప్పుడు రాజధానికి చేరువ కాబోతోందన్న ప్రచారంతో సత్యనారాయణపురం, వన్‌టౌన్, గవర్నర్‌పేట ప్రాంతాల్లో అద్దెలు రెట్టింపయ్యాయి. గతంలో పదివేలు పలికిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కొన్ని చోట్ల ఏకంగా రూ.20 వేల దాకా పెరిగింది. నగర శివారు కానూరు, పోరంకి, యనమలకుదురు, రామవరప్పాడు, సింగ్ నగర్, భవానీపురంలో గతంలో రూ.3వేలు నుంచి ఐదు వేలున్న ఇంటి అద్దె ఇప్పుడు రూ 8 నుంచి రూ .10 వేలకు చేరింది. * విజయవాడలో సుమారు మూడు లక్షల ఇళ్లు ఉండగా నాలుగున్నర లక్షలకుపైగా కుటుంబాలు ఉంటున్నట్టు అంచనా. ప్రస్తుతం నెలకు త్రిబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు రూ.12 నుంచి 25వేలు, డబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు రూ.10 నుంచి 15వేలు, సింగిల్ పోర్షన్ రూ.4 నుంచి 8వేల అద్దెలు ఉన్నాయి. * గుంటూరులో గత మూడు నెలలతో పోల్చితే ఇప్పుడు 30శాతం వరకు అద్దెలు పెరిగాయి. నగరంలో 1.83లక్షల ఇళ్లు ఉంటే 7.60లక్షల జనాభా ఉంది. టూ టౌన్ ప్రాంతంలో రెండు పడక గదుల ఫ్లాట్ రూ.10వేల నుంచి 15వేలకు అద్దె పలుకుతోంది. గుంటూరు తూర్పు ప్రాంతంలో ఇంటి అద్దె రూ.6వేల నుంచి 8వేల వరకు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.8వేల నుంచి 10వేల వరకు ఉంది. * రాజధాని ప్రచారంతో మంగళగిరిలో సైతం అద్దె ఇళ్లకు డిమాండ్ రావడంతో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ఊపందుకుంది. ఇప్పటికే ఎన్ఆర్ఐ ఆసుపత్రి, హాయ్‌ల్యాండ్, కొకొకోలా వంటి వాటితో ఇక్కడ అద్దె ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో 18వేల ఇళ్లు ఉండగా సుమారు 30 వేల కుటుంబాలు ఉంటున్నాయి. గత మూడు నెలల కాలంలో ఇక్కడ అద్దెలు 25 నుంచి 35శాతం పెరిగాయి. ఇల్లు ఖాళీ చేస్తే అద్దెకు మరో ఇల్లు దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో రూ.5వేలు ఉన్న ఫ్లాట్ ఇప్పుడు రూ.8 నుంచి 9వేలకు పెరిగింది.