నర్సంపేట మునిసిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్
మునిసిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ మడిగెల అద్దె వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అద్దెను తక్కువకు కేటాయించి కమీషన్లు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
నర్సంపేట : నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్‌లోని చాపల మార్కెట్, బాలికల పాఠశాల, సెంట్రల్ బ్యాంక్, నెహ్రు పార్కు, మునిసిపాలిటీ ముందు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మునిసిపాలిటీకి చెందిన మొత్తం 64 షాపులను అద్దెకు కేటాయించారు. వాస్తవానికి షాపుల అద్దెను రెన్యూవల్ ద్వారా కాకుండా టెండర్లతో కేటాయిస్తే మూడు రెట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే మూడు సంవత్సరాలకు ఒక్కసారి 33శాతం అద్దె పెంచుతూ రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నారు.
అంబేద్కర్ సెంటర్‌లోని చేపల మార్కెట్ సమీపంలో ఉన్న మునిసిపాలిటీ షాపులకు నెలకు గతంలో రూ.2700 చొప్పున అద్దె నిర్ణయించారు. దీంతో ప్రతి ఏడాది రూ.25లక్షలు ఆదాయం వస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. వాస్తవానికి అంతే విస్తీర్ణంలో ఉన్న ప్రైవేట్ షాపులకు మార్కెట్‌లో రూ.6వేల నుంచి రూ.7వేల వరకు అద్దె ఉంది. ఈ వ్యత్యాసం చూస్తే ప్రతీ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రైవేట్ షాపుల కంటే సగం అద్దెకు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో ప్రతి ఏడాది మరో రూ.25 లక్షల ఆదాయం కోల్పోతోంది.
13 ఏళ్లుగా ఇదే తంతు..
షాపింగ్ కాంప్లెక్స్‌లకు 2005 సంవత్సరంలో టెండర్ల ద్వారా అద్దెలు నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా ప్రతీ సారి అద్దె 33శాతం పెంచి రెన్యూవల్‌తోనే కొనసాగిస్తున్నారు. దీంతో రూ.కోటికి పైగానే ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది.
అధికారుల కనుసన్నల్లోనే..
మునిసిపాలిటీ పరిధిలో పనిచేసే అధికారుల కనుసన్నల్లోనే అద్దెల వ్యవహారం కొనసాగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నా యి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నర్సంపేట 2011లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. టెండర్లు నిర్వహించిన 2005 నుంచి ఆరు సంవత్సరాల పాటు నలుగురు ఈఓపీఆర్‌డీలు మారారు. 2011 నుంచి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన 2018 వరకు ముగ్గురు కమిషనర్లు మారారు. మొత్తం ఏడుగురు అధికారులు మారినా షాపింగ్ కాప్లెక్స్‌లకు రెన్యూవల్‌తోనూ అద్దెలకు కేటాయించారు. కొన్నిచోట్ల ఒక్కరికే రెండు షాపులను కేటాయించి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. తక్కువ అద్దెకు షాపులు కేటాయించి సదరు యజమానులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కమీషన్లు దండుకుంటూ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈసారైనా సక్రమంగా జరిగేనా..
భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ సారి కూడా రెన్యూవల్ పద్ధతిన గట్టెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 64 షాపులలో 75శాతం వాటికి గత మార్చి 31వ తేదీతో గడువు ముగిసిపోయింది. వాటికి వచ్చే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి అద్దెను నిర్ణయించే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి మునిసిపాలిటీకి జరుగుతున్న నష్టాన్ని పాలకవర్గం అడ్డుకుని ఆదాయం పెంచుకుని అభివృద్ధికి బాటలు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నష్టం జరగకుండా చూస్తాం..
మునిసిపాలిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దె పెంచేందుకు సర్వే చేయిస్తాం. ప్రైవేట్ షాపుల అద్దెతో పోల్చి సరాసరి అద్దెను నిర్ణయించి నష్టం జరగకుండా చూస్తాం. ఒకే వ్యక్తికి రెండు షాపులు కేటాయించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం. మునిసిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారమే షాపులను కేటాయించేలా కౌన్సిల్ సమావేశంలో
నిర్ణయిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment