
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీని రోల్ మోడల్‌గా, అతని కుమారుడు ముఖేష్ అంబానీని స్నేహితుడిగా భావిస్తున్నట్లు బిలియనీర్ గౌతమ్ అదానీ తెలిపారు. అంతేకాదు దేశంలోనే అత్యంత సంపన్న అదానీ - అంబానీ కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ధీరూభాయ్ మాకు రోల్ మోడల్, స్ఫూర్తి అని చెప్పారు.
ఈ సందర్భంగా ముఖేష్ భాయ్ నాకు చాలా మంచి స్నేహితుడు. నేను అతనిని గౌరవిస్తాను. సంప్రదాయిక పెట్రోకెమికల్స్ వ్యాపారంతో పాటు జియో, టెక్నాలజీ, రిటైల్ వంటి వ్యాపారాలకు కొత్త దిశానిర్దేశం చేశారు. అంతేకాదు దేశ పురోగతికి దోహదపడుతున్నారని కొనియాడారు.
గత ఏడాది ముకేశ్ అంబానీని అధిగమించి భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో చేరినప్పుడు మీకేమనిపించింది అన్న ప్రశ్నకు అదానీ స్పందించారు. నేను ఈ సంఖ్యల ఉచ్చులో ఎప్పుడూ పడలేదని సమాధానం ఇచ్చారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 117 బిలియన్ల విలువ కలిగిన అదానీ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తర్వాత ఆసియాలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలో మూడవ ధనవంతుడిగా కొనసాగుతున్నారు. కాగా, గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చిన అదానీ, అంబానీలు భారత్ తన ఆర్ధిక వ్యవస్థ పటిష్టం చేసుకునే సమయంలో వ్యాపార రంగాల్లో అడుగు పెట్టి ఏసియా దేశాల్లో ధనవంతులుగా చెలామణి అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment