హైదరాబాద్: స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ధృవ స్పేస్ ఒకట్రెండేళ్లలో రూ.204 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. 100 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అభయ్ ఏగూర్ వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అన్వేషిస్తున్నామని, ఔత్సాహికులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
‘ధృవ స్పేస్ ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు అవసరం లేదు. అయితే కంపెనీకి చెందిన ఇతర విభాగాలకు ఇది అవసరం కావచ్చు. పెద్ద శాటిలైట్ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి వైపునకు కంపెనీ వెళుతోంది. ఇప్పటికే ప్రయోగించిన వాటి కంటే కొంచెం పెద్ద ఉపగ్రహాలను వచ్చే ఏడాది మధ్యలో లే దా చివరిలో కక్ష్యలో ప్రవేశపెట్టగలమని ఆశాభావంతో ఉన్నాం. ఇందుకు తగ్గ అభివృద్ధి పనులు సవ్యంగా జరుగుతున్నాయి.
ధృవ స్పేస్ రూపొందించిన నానో ఉపగ్రహాలు తైబోల్ట్–1, తైబోల్ట్–2 శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ–సీ54 ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా ఇస్రో నవంబర్ 26న విజయవంతంగా ప్రయోగించింది. వీటి విజయం తర్వాత సంస్థ ప్రస్తుతం పీ30 ప్లాట్‌ఫామ్‌లో కమ్యూనికేషన్స్, సైంటిఫిక్ అప్లికేషన్స్‌ను విస్తృతంగా అందజేసే 30 కిలోల బరువున్న ఉపగ్రహంపై పని చేస్తోంది’ అని అభయ్ పేర్కొన్నారు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడం మొదలైందని, ప్రస్తుతం కంపెనీ బృందం ఈ మిషన్‌ను కొనసాగించడంలో, ఉపగ్రహాలను నిర్వహించడంలో బిజీగా ఉందన్నారు. దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ధృవ స్పేస్ ఇప్పటి వరకు రూ.65 కోట్ల నిధులను అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment