న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ కంపెనీలకు సంబంధించి భారత్ పాటిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ (డీఎస్‌టీ) విధానం.. అమెరికన్ కంపెనీల పట్ల వివక్షాపూరితంగా ఉంటోందని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) వ్యాఖ్యానించింది. ఇది అంతర్జాతీయ పన్ను విధానాలకు విరుద్ధమని ఆక్షేపించింది. డీఎస్‌టీపై చేపట్టిన విచారణ నివేదికలో యూఎస్‌టీఆర్ ఈ విషయాలు తెలిపింది. భారతీయ కంపెనీలకు మినహాయింపునిస్తూ, కేవలం విదేశీ సంస్థలనే టార్గెట్ చేస్తున్న భారత డీఎస్‌టీ విధానం పూర్తిగా వివక్షాపూరితమైనదిగా తేటతెల్లమవుతోందని పేర్కొంది. ‘‘దీనివల్ల స్థానికంగా కార్యాలయాలు లేని అమెరికన్ సంస్థల డిజిటల్ సర్వీసులపై పన్నులు విధిస్తుండగా.. అవే సర్వీసులు అందించే భారతీయ ప్రొవైడర్లకు మాత్రం మినహాయింపు ఉంటోంది. ఇది పూర్తిగా వివక్షాపూరితమైనదని స్పష్టమవుతోంది’’ అని యూఎస్‌టీఆర్ నివేదికలో పేర్కొంది. విదేశీ సంస్థలను విడిగా చూడటమే డీఎస్‌టీ ప్రధానోద్దేశమని ఒక ప్రభుత్వ అధికారి కూడా స్పష్టం చేసినట్లు వివరించింది. డిజిటల్ సర్వీసుల రంగంలో అమెరికన్ కంపెనీలు ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉన్న నేపథ్యంలో వాటిపై డీఎస్‌టీ భారం గణనీయంగానే ఉంటోందని తెలిపింది. దీని పరిధిలోకి వచ్చే 119 కంపెనీలను విశ్లేషించగా.. వీటిలో 86 సంస్థలు (దాదాపు 72 శాతం) అమెరికాకు చెందినవే ఉన్నాయని యూఎస్‌టీఆర్ వివరించింది.
అస్పష్టత..
డీఎస్‌టీలోని కొన్ని అంశాలు అంతర్జాతీయ ట్యాక్సేషన్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని, కొన్ని విషయాల్లో స్పష్టత కొరవడిందని యూఎస్‌టీఆర్ తెలిపింది. దీనివల్ల పన్ను వర్తించే సర్వీసులు, ఏ సంస్థలు దీని పరిధిలోకి వస్తాయి వంటి అంశాలపై కంపెనీల్లో గందరగోళం నెలకొందని వివరించింది. వీటిని పరిష్కరించేందుకు భారత్ అధికారికంగా ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని యూఎస్‌టీఆర్ తెలిపింది.
అందరూ సమానమే: భారత్
కాగా, యూఎస్‌టీఆర్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. భారత్‌లో స్థానికంగా ఉండని విదేశీ ఈ–కామర్స్ ఆపరేటర్లు ఎవరికైనా దీన్ని వర్తింపచేస్తున్నామని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సముచిత పోటీని ప్రోత్సహించేందుకు, భారత మార్కెట్లో డిజిటల్ కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారాలపై పన్నులు విధించేందుకు ప్రభుత్వానికి ఉండే అధికారాల పరిధికి లోబడే డీఎస్‌టీ అమలు చేస్తున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment