
ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఎగుమతులకు భారీ అవకాశాలున్నాయని, ఈ దిశగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఈవై–అసోచామ్ నివేదిక సూచించింది. కస్టమ్స్ ప్రక్రియలను సులభంగా మార్చడం, పటిష్ఠ చెల్లింపుల యంత్రాంగం, ఈ-కామర్స్ సంస్థలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడం ద్వారా ఎగుమతులకు ప్రోత్సాహం అందించాలని తెలిపింది.
ఎఫ్‌డీఐ మద్దతుతో నడిచే ఈ-కామర్స్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తుల ఇన్వెంటరీ (నిల్వ)కి అనుమతించాలని, అది భారత ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తుల అంతర్జాతీయ విక్రయాలకు మద్దతునిస్తుందని నివేదిక పేర్కొంది. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో ఈ-కామర్స్ రూపంలో 200–300 బిలియన్ డాలర్లు సాధించాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సాధించాలంటే ప్రస్తుత ఎగుమతులు 50–60 రెట్లు పెరగాల్సి ఉంటుందని ఈ నివేదిక గుర్తు చేసింది.
ఇదీ చదవండి: భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?
2022–23లో ఈ–కామర్స్ వేదికల ద్వారా చేసే ఎగుమతులు 4–5 బిలియన్ డాలర్లు(రూ.41 వేలకోట్లు)గా ఉన్నాయి. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో ఒక శాతంలోపే కావడం గమనార్హం. సంక్లిష్ట కస్టమ్స్ విధానాలు, స్వదేశానికి చెల్లింపుల పరంగా సవాళ్లు, నియంత్రిత విధానాలు ఈ-కామర్స్ ఎగుమతులకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటిని సరళీకరించాని ఈవై అసోచామ్ నివేదిక సూచిస్తుంది. ఎగుమతులకు సంబంధించి విధానాల్లో మార్పులు అవసరమని తెలిపింది. ఈకామర్స్ ఎగుమతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను పెంచాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment