న్యూఢిల్లీ: తమకు ఇష్టమైన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్‌కు వెళ్లి తినే వారి సంఖ్య పెరుగుతోంది. తీరికలేని జీవనశైలిలో.. కొంచెం సమయం లభించినా మనసుకు నచ్చే రుచులను ఆస్వాదించేందుకు వారు మొగ్గు చూపిస్తున్నారు. 2021లో ఏకంగా 4.5 కోట్ల మంది రెస్టారెంట్లకు వెళ్లి తమ జిహ్వ కోరికలను నెరవేర్చుకున్నట్టు ‘డైన్ అవుట్’ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. సగటున వీరు చెల్లించిన ఒక్కో బిల్లు రూ.2,670గా ఉంది. 2020లో ఇది రూ.1,907గానే ఉండడం గమనించాలి. అంటే గతేడాది వీరంతా కలసి రూ.12,015 కోట్లను నచ్చిన ఆహారంపై ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, రెస్టారెంట్లలో టేబుళ్లను బుక్ చేసుకోవడం ద్వారా వీరు రూ.1,360 కోట్ల ఆదా చేసుకున్నట్టు ఈ నివేదిక తెలిపింది. గంటకు 8,588 టేబుళ్లు రెస్టారెంట్లలో బుక్ అయ్యాయి.
ఢిల్లీ వాసులే ముందు..
డైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా (రెస్టారెంట్ భోజనానికి రాజధాని)గా ఢిల్లీని ఈ నివేదిక పేర్కొంది. వరుసగా మూడో ఏడాది ఈ ఖ్యాతిని దక్కించుకుంది. 32 శాతం మంది రెస్టారెంట్ల భోజన ప్రియులు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత 18 శాతం మందితో బెంగళూరు రెండో స్థానంలో ఉంది.
వీటికి ప్రాధాన్యం..
బటర్ చికెన్, దాల్ మఖాని, నాన్ ఎక్కువగా తిన్న పదార్థాలలో ఉన్నాయి. 38 శాతం ఉత్తరాది ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వగా.. చైనీస్ వంటకాలకు 18 శాతం, కాంటినెంటల్ (యూరోపియన్) వంటకాలను 16 శాతం మంది ఆర్డర్ చేశారు.
టేబుల్‌కు ఇద్దరే..
ప్రేమ జంటలకు ఉదయ్‌పూర్ రాజధానిగా నిలిచింది. ఇందుకు నిదర్శనంగా ఈ పట్టణంలో రెస్టారెంట్లలో 44 శాతం బుకింగ్‌లు ఇద్దరి కోసం చేసుకున్నవే ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల బృందాలు ఎక్కువగా ఆగ్రా, లుధియానాలో రెస్టారెంట్లకు వెళుతున్నారు. ఇక్కడ ఒక టేబుల్‌ను నలుగురి కోసం బుక్ చేసుకున్నారు. ఖర్చు చేయడానికి వీలుగా బ్యాలన్స్ ఉండడం, ఇంటి నుంచే పని విధానంతో దేశవ్యాప్తంగా ఖరీదైన ఆహార సేవనం 120 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలియజేసింది. అలాగే, నాణ్యమైన రెస్టారెంట్లలో భోజనాలు కూడా 105 శాతం పెరిగినట్టు పేర్కొంది.
లిక్కర్ క్యాపిటల్ గా బెంగళూరు
గత డిసెంబర్‌లో బెంగళూరు నగరం 50,000 లీటర్ల ఆల్కహాల్‌ను వినియోగించుకుంది. దీంతో 2021 సంవత్సరానికి లిక్కర్ రాజధానిగా బెంగళూరును ఈ నివేదిక ప్రస్తావించింది. రెస్టారెంట్లలో రాత్రి భోజనానికి (డిన్నర్) ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆగ్రాలో 59.3 శాతం మంది రెస్టారెంట్లలో డిన్నర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెన్నై వాసులు 47 శాతం మంది మధ్యాహ్న భోజనాన్ని రెస్టారెంట్లలో తినేందుకు ఇష్టపడుతున్నారు. ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్ ప్రముఖ రెస్టారెంట్ల ప్రాంతంగా ఉంది. ముంబైలోని లోయర్ పారెల్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, చెన్నైలోని త్యాగరాయ నగర్, కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతాలు కూడా ఈ కోవలోకే వస్తాయని డైన్‌అవుట్ నివేదిక వివరించింది.
చదవండి:లగ్జరీ ఫుడ్ స్టోర్ వ్యాపారంలో అడుగుపెట్టిన టాటా గ్రూప్..!
Comments
Please login to add a commentAdd a comment