
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులకు సంబంధించిన ఒప్పందం నుంచి తప్పుకున్నందుకు గాను కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిస్నీ స్టార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ భారత విభాగం విలీన డీల్ రద్దుతో సతమతమవుతున్న జీకి ఈ పరిణామం మరింత సమస్యాత్మకంగా మారవచ్చని వివరించాయి.
నాలుగేళ్ల పాటు ఐసీసీ మెన్స్, అండర్–19 క్రికెట్ టీవీ ప్రసార హక్కుల కోసం డిస్నీ స్టార్‌తో 2022లో జీ 1.4 బిలియన్ డాలర్ల సబ్–లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద తొలి విడతగా 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. సోనీతో డీల్ కుదిరితే వచ్చే నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించవచ్చని జీ భావించింది. కానీ అది రద్దవడంతో చెల్లింపులు జరపలేకపోయింది. తదుపరి ఈ విషయంలో ముందుకెళ్లదల్చుకోవడం లేదంటూ డిస్నీ స్టార్‌కి తెలిపింది. దీంతో డిస్నీ స్టార్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా సమాచారం.