హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–13 శాతం పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా తెలిపింది. 2023–24లో 15–15.5 కోట్ల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేసింది. కోవిడ్ ముందస్తు 2019–20నాటి 14.12 కోట్ల ప్యాసింజర్లను దాటొచ్చని వివరించింది. విమానయాన పరిశ్రమ నష్టాలను మరింత తగ్గించుకోవచ్చని వెల్లడించింది.
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో నిరంతర పునరుద్ధరణ, టికెట్ల ధరలు మెరుగైన నేపథ్యంలో భారతీయ విమానయాన రంగంపై స్థిరమైన అంచనాలు ఉన్నట్టు ఇక్రా ప్రకటించింది. ‘2023–24లో ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో 6.32 కోట్ల మంది విమాన ప్రయాణం సాగించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. 2019–20 ఏప్రిల్–ఆగస్ట్‌లో 5.89 కోట్ల మంది దేశీయంగా విమానాల్లో విహరించారు.
భారత్ నుంచి విదేశాలకు, విదేశాల నుంచి భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5–2.7 కోట్ల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. 2022–23లో పరిశ్రమ రూ.17,000–17,500 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3,000–5,000 కోట్లకు వచ్చి చేరనుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలలో 2023 ఏప్రిల్ నుండి తగ్గుదల (ఇటీవలి పెరుగుదల ఉన్నప్పటికీ), సాపేక్షంగా స్థిర విదేశీ మారకపు రేట్ల కారణంగా విమానయాన సంస్థల ధరల శక్తి కొనసాగుతుంది’ అని ఇక్రా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment