Domestic air passenger traffic
-
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మే నెలలో 1.39 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023 మే నెలతో పోలిస్తే ఇది 5.1 శాతం అధికం. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌లో 1.32 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2024–25లో ట్రెండ్ కొనసాగుతుందని ఇక్రా భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో సానుకూల ధోరణి కొనసాగుతుందని పేర్కొంది. నివేదిక ప్రకారం.. గత నెలలో వియానయాన సంస్థల సామర్థ్యం 2023 మే నెలతో పోలిస్తే 6 శాతం, 2024 ఏప్రిల్‌తో పోలిస్తే 2 శాతం పెరిగింది. భారత్ నుంచి 2023–24లో 24 శాతం అధికంగా 2.97 కోట్ల మంది విదేశీయానం చేశారు. పరిశ్రమ కోవిడ్‌కు ముందు స్థాయిల కంటే అధిక రాబడి అందుకుంది. -
విమానయాన ప్రాప్తిరస్తు! ఈ ఏడాది ఎన్ని కోట్ల మంది ఎక్కుతున్నారంటే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–13 శాతం పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా తెలిపింది. 2023–24లో 15–15.5 కోట్ల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేసింది. కోవిడ్ ముందస్తు 2019–20నాటి 14.12 కోట్ల ప్యాసింజర్లను దాటొచ్చని వివరించింది. విమానయాన పరిశ్రమ నష్టాలను మరింత తగ్గించుకోవచ్చని వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో నిరంతర పునరుద్ధరణ, టికెట్ల ధరలు మెరుగైన నేపథ్యంలో భారతీయ విమానయాన రంగంపై స్థిరమైన అంచనాలు ఉన్నట్టు ఇక్రా ప్రకటించింది. ‘2023–24లో ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో 6.32 కోట్ల మంది విమాన ప్రయాణం సాగించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. 2019–20 ఏప్రిల్–ఆగస్ట్‌లో 5.89 కోట్ల మంది దేశీయంగా విమానాల్లో విహరించారు. భారత్ నుంచి విదేశాలకు, విదేశాల నుంచి భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5–2.7 కోట్ల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. 2022–23లో పరిశ్రమ రూ.17,000–17,500 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3,000–5,000 కోట్లకు వచ్చి చేరనుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలలో 2023 ఏప్రిల్ నుండి తగ్గుదల (ఇటీవలి పెరుగుదల ఉన్నప్పటికీ), సాపేక్షంగా స్థిర విదేశీ మారకపు రేట్ల కారణంగా విమానయాన సంస్థల ధరల శక్తి కొనసాగుతుంది’ అని ఇక్రా వెల్లడించింది. -
1.25 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 జనవరిలో 1.25 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 96 శాతం అధికమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘కోవిడ్ ముందస్తు 2020 జనవరితో పోలిస్తే దేశీయ ప్రయాణికుల సంఖ్య గత నెలలో 2 శాతం తగ్గింది. దేశీయ ప్రయాణికుల రద్దీలో రికవరీ మెరుగ్గా ఉన్నప్పటికీ.. భారతీయ విమానయాన సంస్థల ఆర్థిక పనితీరు సమీప కాలంలో ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది. 2022–23లో ప్రయాణికుల రద్దీలో అర్థవంతమైన మెరుగుదల ఆశించినప్పటికీ పరిశ్రమ ఆదాయాల్లో రికవరీ వేగం క్రమంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.23,500 కోట్ల నికర నష్టంతో పోలిస్తే 2022–23లో నికర నష్టం తక్కువగా ఉంటుందని అంచనా. ప్రధానంగా ప్రయాణికుల రద్దీ, ఛార్జీల పెంపుదల, తక్కువ వడ్డీ భారం ఇందుకు కారణం. 2022 జనవరితో పోలిస్తే గత నెలలో సామర్థ్య విస్తరణ 42 శాతం ఎక్కువ. కోవిడ్ ముందస్తుతో పోలిస్తే 6 శాతం తక్కువ’ అని ఇక్రా తెలిపింది. త్వరగా రికవరీ.. ‘కార్యకలాపాలలో సాధారణ స్థితి, మహమ్మారి ప్రభావం తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల రద్దీలో త్వరిత పునరుద్ధరణ ఉంటుందని అంచనా. పెరిగిన పోటీ వాతావరణం మధ్య యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి క్షీణతకుతోడు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరగడం వల్ల దేశీయ విమానయాన సంస్థలకు ఆదాయాల రికవరీ క్రమంగా ఉంటుంది. ప్రస్తుత ఏటీఎఫ్ ధరలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 32 శాతం అధికం. పెరిగిన ఏటీఎఫ్ ధరలు సమీప, మధ్య కాలానికి విమానయాన సంస్థల ఆదాయాలు, నగదు నిల్వలకు పెద్ద ముప్పుగా కొనసాగుతాయి. అలాగే లీజు అద్దెలు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులను ప్రతికూలంగా ప్రభావితం చేసే యూఎస్ డాలర్‌తో భారత రూపాయి విలువ క్షీణించడం విమానయాన సంస్థల వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అధికం అయిన వ్యయాలకు అనుగుణంగా ఛార్జీల పెంపుదల ఉండేలా ఎయిర్‌లైన్స్ చేసే ప్రయత్నాలు వారి లాభదాయకతలో కీలకం కానున్నాయి’ అని ఇక్రా వివరించింది. -
విమానాల్లో చక్కర్లు.. భారీగా పెరిగిన ప్రయాణికులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 మే నెలలో 1.20 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 మే నెలతో పోలిస్తే ఇది అయిదు రెట్లు అధికం కావడం విశేషం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం..గతేడాది దేశీయంగా మే నెలలో 21 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. 1.20 కోట్లలో ఇండిగో విమానాల ద్వారా 70 లక్షల మంది విహంగ విహారం చేశారు. మొత్తం ప్రయాణికుల్లో ఇది 57.9 శాతం. గో ఫస్ట్ ద్వారా 12.76 లక్షల మంది రాకపోకలు సాగించారు. -
రద్దీ పెరిగిపోతుంది, 49 లక్షలకు చేరిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలతో పోలిస్తే జులైలో ప్యాసింజర్ ట్రాఫిక్ 57 శాతం వృద్ధి చెంది 49 లక్షలకు చేరింది. గతేడాది జూన్‌లో రద్దీ 31.1 లక్షలుగా ఉందని.. ఏడాది కాలంతో పోలిస్తే 132 శాతం వృద్ధి రేటు నమోదయిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది జులైలో సగటున ప్రతి విమానంలో 104 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదే జూన్ నెలలో ప్యాసింజర్ సంఖ్య 98గా ఉంది. ఇదే సమయంలో ఎయిర్‌లైన్స్ సామర్థ్యం కూడా పెరిగింది. గతేడాది జులైలో 24,770 విమానాలు డిపార్చర్ కాగా.. ఈ ఏడాది జులై నాటికి 90 శాతం పెరుగుదలతో 47,200 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ అయ్యాయని పేర్కొంది. సగటు రోజు వారీ డిపార్చర్స్ చూస్తే.. గతేడాది జులైలో 800 విమానాలు కాగా.. ఈ ఏడాదికవి 1,500లకు పెరిగాయి. జూన్ నెలలో రోజుకు 1,100 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ జరిగాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ కో–గ్రూప్ హెడ్ కింజల్ షా వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నప్పటికీ విమానాశ్రయ సంస్థలపై ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో లీజర్, వ్యాపార ప్రయాణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని.. కేవలం అత్యవసరమైన వాటికి మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు -
విమానాల్లో తెగ తిరిగేశారు!
న్యూఢిల్లీ: దేశీయ విమానాలలో ప్రజారవాణా జులై నాటికి 29 శాతం మేర పెరిగినట్లు అధికారక సమాచార విభాగం మంగళవారం వెల్లడించింది. ప్రయాణికులను చేరవేసే క్రమంలో స్పైస్ జెట్ రవాణా 93.4 శాతం ముందుంజలో ఉందని పేర్కొంది. దాంతో మొత్తంగా దేశీయ విమానాలు తమ రవాణాలో 67.45 లక్షల ఆదాయాన్ని రాబట్టినట్టు పేర్కొంది. స్పైస్ జెట్ సౌకర్యాలు ప్రయాణికులను అమితంగా ఆకట్టుకోవడంతో వాటికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే గడిచిన నెలలో దేశీయ విమానాల రవాణా 52.16 లక్షలకు చేరిందని పేర్కొంది. గత సంవత్సరం జనవరి, జులై మధ్య మాసాల్లో 21.13 శాతం మేర ఆదాయం రూ. 376.28 లక్షలు రాబట్టగా, 2015వ సంవత్సరంలో వచ్చిన ఆదాయం రూ. 455.78 లక్షలు పెరిగినట్టు గణాంక విశ్లేషణలో వెల్లడైంది. గత సంవత్సరం జూన్‌లో 56.89 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.01 లక్షలకు చేరింది. కాగా, ఈ సంవత్సరం జూన్‌లో ప్రయాణికుల రవాణా 16.03 శాతానికి పెరిగింది. -
20 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ ట్రాఫిక్ ఈ ఏడాది ఆగస్టులో 20% వృద్ధి చెందిందని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. వివిధ ఆఫర్ల ద్వారా విమాన చార్జీలు తక్కువగా ఉండడం, 3 సెలవు రోజులు(జన్మాష్టమి, స్వాతంత్య్ర దినోత్సవం, ఈదుల్ ఫితర్) కారణంగా దేశీయంగా విమానయానం పెరిగిందని పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో 43.69 లక్షల మంది విమానయానం చేయగా ఈ ఏడాది ఆగస్టులో ఈ సంఖ్య 20% వృద్ధితో 52.5 లక్షలకు పెరిగింది. ఇండిగో సంస్థ అధిక మార్కెట్ వాటా(29.1%)ను సాధించింది. 25.1% మార్కెట్ వాటాతో జెట్, జెట్‌లైట్‌లు కలిసి రెండో స్థానంలో ఉన్నాయి. ఎయిర్ ఇండియా(19.9%), స్పైస్‌జెట్(17.2%), గో ఎయిర్(8.7%) ఆ తర్వాత ఉన్నాయి. ప్యాసింజర్స్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) విషయంలో ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా ముందంజలో ఉంది. ఎయిర్ ఇండియా పీఎల్ఎఫ్ 78.7%గా ఉండగా, ఇండిగో పీఎల్ఎఫ్ 76%గా ఉంది. 79% పీఎల్‌ఎఫ్‌తో గో ఎయిర్ మొదటి స్థానంలో నిలిచింది. ఇతర కంపెనీల పీఎల్ఎఫ్లు ఇలా ఉన్నాయి.. జెట్ (74.9%), జెట్‌లైట్ (73.9%), స్పైస్‌జెట్ (75.8%). వన్‌టైమ్ పెర్ఫామెన్స్(ఓటీపీ) విషయంలో ఇండిగో 91.4 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో స్పైస్‌జెట్(90.8 శాతం), జెట్, జెట్‌లైట్(88 శాతం), గో ఎయిర్(84.8 శాతం), ఎయిర్ ఇండియా (82 శాతం)లు ఉన్నాయి. ఓటీపీ విషయంలో విదేశీ విమాన సంస్థల విషయంలో తుర్క్మెనిస్తాన్ ఎయిర్‌లైన్స్ వంద శాతం ఓటీపీ సాధించింది.