
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలతో పోలిస్తే జులైలో ప్యాసింజర్ ట్రాఫిక్ 57 శాతం వృద్ధి చెంది 49 లక్షలకు చేరింది. గతేడాది జూన్‌లో రద్దీ 31.1 లక్షలుగా ఉందని.. ఏడాది కాలంతో పోలిస్తే 132 శాతం వృద్ధి రేటు నమోదయిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది జులైలో సగటున ప్రతి విమానంలో 104 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదే జూన్ నెలలో ప్యాసింజర్ సంఖ్య 98గా ఉంది. ఇదే సమయంలో ఎయిర్‌లైన్స్ సామర్థ్యం కూడా పెరిగింది. గతేడాది జులైలో 24,770 విమానాలు డిపార్చర్ కాగా.. ఈ ఏడాది జులై నాటికి 90 శాతం పెరుగుదలతో 47,200 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ అయ్యాయని పేర్కొంది.
సగటు రోజు వారీ డిపార్చర్స్ చూస్తే.. గతేడాది జులైలో 800 విమానాలు కాగా.. ఈ ఏడాదికవి 1,500లకు పెరిగాయి. జూన్ నెలలో రోజుకు 1,100 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ జరిగాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ కో–గ్రూప్ హెడ్ కింజల్ షా వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నప్పటికీ విమానాశ్రయ సంస్థలపై ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో లీజర్, వ్యాపార ప్రయాణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని.. కేవలం అత్యవసరమైన వాటికి మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment