న్యూఢిల్లీ: అంకుర సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ (కొనుగోళ్ల)పై ఆధారపడొద్దని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ సూచించారు. దానికి బదులుగా దేశీ మార్కెట్, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు.
కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొనుగోళ్ల ద్వారా స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు సానుకూలంగా కృషి చేస్తున్నాయని, అనేక సందర్భాల్లో పలు మినహాయింపులు కూడా ఇస్తున్నాయని ఆయన చెప్పారు. అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ చక్కని రన్‌వేలాంటిదని కాంత్ వివరించారు. ‘అయితే, అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వాలు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. చురుకైన స్టార్టప్‌లు మార్కెట్‌ప్లేస్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
ప్రభుత్వ కొనుగోళ్లపై మరీ ఎక్కువగా ఆధారపడిపోకూడదు‘ అని ఆయన చెప్పారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి స్కీముల ద్వారా స్టార్టప్‌లకు పెట్టుబడులు లభించేలా తోడ్పాటు అందించడానికి మాత్రమే ప్రభుత్వ పాత్ర పరిమితం కావాలని కాంత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, లింగ అసమానతలను రూపుమాపేందుకు, మహిళల జీవన ప్రమా ణాలు మరింత మెరుగుపడేందుకు పురుషుల దృష్టికోణం మారాలని ఆయన చెప్పారు. సాధారణంగా భారత్, దక్షిణాసియాలో ఆస్తిని కుమార్తెలకు కాకుండా కుమారులకే మార్పిడి చేసే సంస్కృతి ఉందని.. అలా కాకుండా కుమార్తెల పేరిట బదిలీ చేసే సంస్కృతి వస్తే దశాబ్ద కాలంలోనే మహిళలు మరింతగా రాణించడాన్ని చూడగలమని కాంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment