హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా జర్మనీకి చెందిన నింబస్ హెల్త్‌ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు నిశ్చయాత్మక ఒప్పందం కుదిరిందని కంపెనీ గురువారం ప్రకటించింది. అయితే డీల్ విలువను రెడ్డీస్ వెల్లడించలేదు. ఔషధాల తయారీలో ఉపయోగించే గంజాయిని టోకుగా విక్రయించేందుకు నింబస్ హెల్త్‌కు జర్మనీలో లైసెన్స్ ఉంది. సంబంధిత ఔషధాలను ప్రవేశపెట్టేందుకు ఈ కంపెనీ కొనుగోలు దోహదం చేస్తుందని రెడ్డీస్ వెల్లడించింది.
‘అధిక వైద్య అవసరాలను పరిష్కరించడానికి, చికిత్సకు ఔషధ గంజాయిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నొప్పి నివారణ, నరాల సంబంధ సమస్యలకు వినియోగిస్తున్నారు. ఔషధ గంజాయిపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం మేము తప్పనిసరిగా ఉండాల్సిన విభాగం అని నమ్ముతున్నాం’ అని డాక్టర్ రెడ్డీస్ యూరోపియన్ జనరిక్స్ హెడ్ ప్యాట్రిక్ అఘానియన్ తెలిపారు. 2017లో జర్మనీ పార్లమెంట్ చట్టబద్ధం చేయడంతో ఔషధ గంజాయికి కొన్నేళ్లుగా డిమాండ్ పెరుగుతోంది. జర్మనీలో ఔషధ గంజాయి విపణి గతేడాది 25 శాతం అధికమై రూ.1,030 కోట్లుంది.
చదవండి: విదేశాలకు లక్ష కియా కార్లు
Comments
Please login to add a commentAdd a comment