సాక్షి, న్యూఢిల్లీ: ట్విటర్ ఎట్టకేలకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సొంతమైంది. కొన్ని నెలలుగా సాగదీతకు గురైన డీల్ గురువారంతో పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు మస్క్.. ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఇక ముందునుంచి అనుకుంటున్నట్టుగానే వచ్చీరావడంతో ఆయన కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. ఇతర కార్యనిర్వాహక సభ్యులను కూడా తొలగించారు. మొత్తంమీద ట్విటర్ కొనుగోలు ప్రక్రియ సందిగ్దంలో పడటంతో కంపెనీ వ్యాపార వ్యవహరాలపై ఆ మేరకు ప్రభావం పడింది. దాంతోపాటు ఉద్యోగులు, వాటాదారుల్లో అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ ప్రక్రియ ముగియడంతో పరిస్థితులు చక్కబడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
(చదవండి: సీసీఐ జరిమానాలపై తదుపరి చర్యలు పరిశీలిస్తున్నాం: గూగుల్)
నాటకీయ పరిణామాలు
ఏప్రిల్ నెలలో మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫాం ట్విటర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, స్పామ్, నకిలీ బాట్ అకౌంట్ల సంఖ్యను ట్విటర్ తప్పుగా చూపించిందని ఆరోపిస్తూ ఆయన వెనక్కి తగ్గారు. దీంతో ట్విటర్ దావాకు వెళ్లడం.. ఆ క్రమంలో విమర్శలు, ప్రతి విమర్శలు, సెటైర్లతో ఈ డీల్ గట్టెక్కదని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మస్క్ మనసు మార్చుకుని లైన్‌లోకి వచ్చారు.
మరోవైపు ట్విటర్ కొనుగోలు ప్రక్రియ పూర్తవడానికి ముందు ఆయన విభిన్న రీతిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సింక్‌ను మోసుకెళ్తూ లోనికి ఎంట్రీ ఇచ్చారు. ‘లెట్ ద సింక్ ఇన్’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. డీల్ ఓకే అయిందని సూచిస్తూ ఆయన సింక్‌ను మోసుకెళ్లారని కొందరు అంటుంటే.. తేడా కొడితే మునిగిపోవడం ఖాయం అంటూ ట్వీట్ చేశారని మరికొందరు కామెంట్ చేశారు.
(చదవండి: మస్క్‌కు షాక్: ట్విటర్ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్?)
Comments
Please login to add a commentAdd a comment