భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటినే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలోనే 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును మన దేశంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశీయ టెలికామ్ సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.
భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. అయితే ఈ సర్వీస్ దేశంలో ప్రారంభమైన తరువాత.. ఇది చాలా ఖరీదైనదిగా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ధరలను కూడా కంపెనీ ప్రకటించలేదు.
కంపెనీ మాజీ హెడ్ ప్రకారం.. స్టార్‌లింక్ మన దేశంలో ప్రారంభమైతే, మొదటి సంవత్సరంలో పన్నులతో సహా రూ. 1,58,000 ఖర్చు అవుతుంది. ఇందులో వన్‌టైమ్ ఎక్విప్‌మెంట్ ధర రూ. 37,400.. నెలవారీ సర్వీస్ ఫీజు రూ. 7,425గా ఉంటుంది. రెండో ఏడాది యూజర్ సుమారు రూ. 1,15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
స్టార్‌లింక్ సర్వీస్ చార్జీలతో పోలిస్తే.. జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి సర్వీస్ చార్జీలు చాలా తక్కువ. కాబట్టి స్టార్‌లింక్ మన దేశంలో మంచి ఆదరణ పొందుతుందా? అనేది ప్రశ్నార్థంగా ఉంది.
స్టార్‌లింక్ సర్వీస్ ధరలు చాలా ఎక్కువ అయినప్పటికీ.. ఈ సేవలకు అవసరమైన లైసెన్స్‌లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ధృవీకరించారు. అయితే స్టార్‌లింక్ సక్సెస్ అనేది మొత్తం దాని చేతుల్లోనే ఉంది.
భారతదేశంలోని వినియోగదారులను ఆకర్షించడానికి.. స్టార్‌లింక్ దాని ధరలను తగ్గించడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ధరలు మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తే.. స్టార్‌లింక్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు డిసెంబర్ 15 నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment