ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు జనవరిలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. రూ.12,546 కోట్లు నికరంగా ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. గత నాలుగు నెలల్లో ఈక్విటీ ఫండ్స్‌లోకి ఒకనెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. 2022 డిసెంబర్‌లో ఈక్విటీల్లోకి రూ.7,303 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే ఏడాది నవంబర్‌లో రూ.2,258 కోట్లు, అక్టోబర్‌లో రూ.9,390 కోట్ల చొప్పున వచ్చాయి. ఇక 2022 సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,100 కోట్లు నెలవారీ గరిష్ట స్థాయిగా ఉంది. ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 23వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు రావడాన్ని గమనించొచ్చు. 2023 జనవరి గణాంకాలను ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది.
విభాగాల వారీగా..
అత్యధికంగా స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,902 కోట్లు, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.1,773 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,628 కోట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లోకి రూ.14,14 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.1,006 కోట్లు, సెక్టోరల్, థీమ్యాటిక్ పథకాల్లోకి రూ.903 కోట్లు, కాంట్రా ఫండ్స్‌లోకి రూ.763 కోట్లు, లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.716 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్‌లోకి రూ.183 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులు వచ్చాయి.
ఫిక్స్‌డ్ ఇన్‌కమ్
స్థిరాదాయ పథకాల (డెట్) నుంచి జనవరిలో నికరంగా రూ.10,316 కోట్లు బయటకు వెళ్లాయి. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లో రూ.5,042 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రూ.3,859 కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్‌లో రూ.3,688 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు విక్రయించారు. మనీ మార్కెట్ పథకాలు రూ.6,460 కోట్లు ఆకర్షించాయి. ఇక హైబ్రిడ్ పథకాలు సైతం రూ.4,492 కోట్లు ఆకర్షించగా, మల్టీ అస్సెట్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.2,055 వచ్చాయి. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ.5,813 కోట్లు వచ్చాయి.
ఇన్వెస్టర్లలో నమ్మకం
‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాలపై నమ్మకాన్ని ఉంచారు. దీనికి నిదర్శనమే రూ.12,546 కోట్లు రావడం. నెలవారీగా చూస్తే ఇది 72 శాతం అధికం’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నా ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు.
సిప్ బలం
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.13,856 కోట్లు వచ్చాయి. డిసెంబర్‌లో వచ్చిన రూ.13,573 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ పెట్టుబడులు రూ.13వేల కోట్లకు పైగా రావడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. సిప్ ఖాతాల సంఖ్య 6.21 కోట్లుగా ఉంది. నికరంగా 9.20 లక్షల కొత్త సిప్ ఖాతాలు రిజిస్టర్ అయ్యాయి. ఒకవైపు ఎఫ్‌పీఐలు విక్రయాలు చేస్తున్నప్పటికీ మార్కెట్లు స్థిరంగా ఉండడానికి సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచినట్టు యాంఫి సీఈవో ఎన్‌ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు.
ఈక్విటీల్లోకి మళ్లీ పెట్టుబడుల వరద
Published Fri, Feb 10 2023 6:42 AM | Last Updated on Fri, Feb 10 2023 6:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment