పెట్టుబడిగా రియల్‌ ఎస్టేట్‌ మెరుగైనదేనా? | Experts Opinion About Investments Plans In realty | Sakshi
Sakshi News home page

పెట్టుబడిగా రియల్‌ ఎస్టేట్‌ మెరుగైనదేనా?

Published Mon, Jan 31 2022 8:27 AM | Last Updated on Mon, Jan 31 2022 11:05 AM

Experts Opinion About Investments Plans In realty - Sakshi

పెట్టుబడి కోసం రియల్‌ ఎస్టేట్‌ మెరుగైన సాధనమేనా? ఇతర ఉత్పత్తులతో దీన్ని ఎలా పోల్చి చూడాలి?– శివమ్‌ కంది 
రియల్‌ ఎస్టేట్‌ను పెట్టుబడి సాధనంగా నేను భావించడం లేదు. నివాసం కోసం ఇల్లు. లేదంటే పొలం. భూమి కోసం చేసే పెట్టుబడి, వ్యయాలు, మూలధనం, ఈ పెట్టుబడిపై తగినంత రాబడి రేటు ఇవన్నీ చూడాలి. రాబడులు తగినంత లేకపోయినా దీర్ఘకాలంలో భూముల ధరలు పెరుగుతాయన్న అంచనాలతో ముందుకు వెళ్లొచ్చని ఎవరైనా భావించొచ్చు. ఇల్లు అయితే ఒక కుటుంబం నివసించేందుకే గానీ, పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టింపు కాదు. పెట్టుబడిగా రియల్‌ ఎస్టేట్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెట్టుబడి పరిమాణం అధికంగా కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిలో సవాళ్లూ ఉంటాయి. ఒకవేళ ప్రాపర్టీని అద్దెకు ఇస్తే కిరాయిదారు రూపంలో ఇంటి నిర్వహణ మెరుగ్గా కొనసాగొచ్చు. అలా చూస్తే చాలా మందికి ఇల్లు మంచి పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. ఇల్లు ఎంత గొప్పది అయినా 20 ఏళ్ల తర్వాత డిమాండ్‌ తగ్గుతుంది. అద్దెకు ఉండేవారు అధునికమైన, కొత్త ఇంటి కోసం ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక రియల్‌ ఎస్టేట్‌ విలువ పెరిగినా కానీ, అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. నా సలహా ఏమిటంటే రియల్‌ ఎస్టేట్‌ను పెట్టుబడిగా కాకుండా నివాసంగానే చూడండి. 

డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ పథకాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి?– మంజునాథ ఉపాధ్యాయ 
డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు పన్ను పరంగా అనుకూలం కానందున వీటి పట్ల నేను వ్యతిరేకం. డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ కింద ఫండ్‌ సంస్థ డివిడెండ్‌ ప్రకటించినట్టయితే ఆ మొత్తం ఇన్వెస్టర్‌ బ్యాంకు ఖాతాకు రాదు. ఆ మొత్తం ఆటోమేటిక్‌గా అదే పథకంలో పెట్టుబడిగా మారిపోయి యూనిట్లు జమ అవుతాయి. దాంతో డివిడెండ్‌ విలువకు సరిపడా యూనిట్లను పొందుతారు. ఈ కార్యక్రమం మొత్తం మీద చేతికి వచ్చే డివిడెండ్‌ ఏమీ లేకపోయినా పన్ను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల డివిడెండ్‌ ఆదాయం కూడా మొత్తం ఆదాయానికి కలుస్తుంది. అప్పుడు వారికి వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లకు గ్రోత్‌ ప్లాన్‌ మెరుగైన ఎంపిక అవుతుంది.  
- ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌ )
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement