కరోనా ఉధృతి కాస్త తగ్గడంతో ఇప్పుడిప్పుడే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యాపారాలు మొదలయ్యాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు కూడా క్రమంగా జుకుంటున్నాయనే చెప్పాలి. ఆదాయపు పన్నుకి సంబంధించి స్థిరాస్తుల క్రయవిక్రయ లావాదేవీల్లో ఎంతో జాగ్రత్త వహించాలి. ఈ వారం కొనే వారికి సంబంధించిన అంశాలు పరిశీలిద్దాం. దానికన్నా ముందు రెండు పక్షాలూ తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
- అటు అమ్మేవారు, ఇటు కొనేవారు ప్రతిఫలం విషయంలో సరైన అవగాహనకి రావాలి. హెచ్చుతగ్గులు పనికి రావు. భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఈ మేరకు ఒప్పందం .. అగ్రిమెంటు రాసుకోవాలి.
- మొత్తం వ్యవహారం.. ప్రతిఫలం అంతా వైట్‌లోనే ఉండాలి. బ్లాక్ వ్యవహారం వద్దే వద్దు. మామూలు వస్తువులు, సేవల్లో నగదు లావాదేవీలు ఉండకూడదు. అలాగే, స్థిరాస్తి క్రయవిక్రయాలలో కూడా నిషేధం.
- విక్రయించేటప్పుడు నగదు పుచ్చుకోకూడదు. ఇవ్వనూ కూడదు.
- నగదు పుచ్చుకునే వ్యక్తికి, ఎంత మొత్తం నగదుగా పుచ్చుకుంటే అంత పెనాల్టీ ఉంటుంది. మిగతా అన్ని వ్యవహారాలనూ ఆరా తీస్తారు. అప్పుడు పాతవి, కొత్తవి బైటపడతాయి. కొండనాలుకకు మందు వేస్తే అసలు నాలుక బైటపడినట్లవుతుంది.
కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- ఒప్పందంలో రాసుకున్న ప్రతిఫలాన్ని పూర్తిగా వైట్‌లోనే చెల్లించాలి.
- చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా .. అంటే చెక్కు ద్వారా RTGS లేదా NEFT ద్వారా లేదా డీడీల ద్వారా చేయాలి.
- నగదు ప్రశ్న తలెత్తకూడదు.
- చెల్లించే ప్రతి రూపాయికి ‘సోర్స్‘ ఉండాలి. దీని గురించి మనం గత వారం తెలుసుకున్నాం. ‘సోర్స్‘ అంటే ఆదాయమే అయి ఉండాలనేమీ లేదు. ఆదాయమే అయితే లెక్కల్లో చూపించి, డిక్లేర్ చేయండి.
- పన్నుకు గురికాని ఆదాయమే అయితే, సంబంధించిన కాగితాలు భద్రపర్చుకోండి. రిటర్నులలో డిక్లేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం ఒక ‘కాలం‘ ఉంటుంది. అందులో రాయండి.
- గత సంవత్సరానికి సంబంధించి పన్నుకి గురి కాని వాటి వివరాలు ఉంచుకోండి. మినహాయింపు పొందిన ఆదాయాలు, పీఎఫ్ విత్‌డ్రాయల్స్, ఎన్‌ఎస్‌సీ (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్)ల మెచ్యూరిటీలు, జీవిత బీమా గడువు తీరాక వచ్చే చెల్లింపులు, గ్రాట్యుటీలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు వంటివెన్నో పన్ను భారం పడని వాటిల్లో ఉంటాయి.
- మీ అబ్బాయి/అమ్మాయి విదేశాల నుంచి పంపే నిధులేమైనా ఉంటే వాటికి సంబంధించిన కాగితాలన్నీ భద్రపర్చండి.
- బ్యాంకు అప్పులు,, ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులు, మిత్రులు ఇచ్చిన రుణాలు .. ఇలా ఎన్నో ఉంటాయి. ఏదైనా సరే ప్రతీ దానికి ఒక కాగితం .. ఓ రాత.. ఓ కోత.. రుజువులు ఉండాలి.
- ముందుగా ‘సోర్స్‘ మీ అకౌంటులో జమగా ఉండాలి. ఆ తర్వాతే ‘ఖర్చు‘ డెబిట్ జరగాలి. ఈ ‘సీక్వెన్స్‘లో రెండోది ముందు, మొదటిది తర్వాత జరగకూడదు. ‘షార్ట్‌ఫాల్‘ ఉండకూడదు. ఒకవేళ ‘షార్ట్‌ఫాల్‘ ఉంటే దాన్ని ఆదాయంగా భావిస్తారు. కాబట్టి జాగ్రత్త. చెల్లించే ప్రతిఫలం రూ. 50,00,000 దాటితే టీడీఎస్‌కి సంబంధించిన నియమాలు వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి.
- కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు
Comments
Please login to add a commentAdd a comment