‘రాడ్‌టెప్‌’కు మరిన్ని నిధులు కేటాయించాలి | Exporters seek support measures in budget to boost shipments | Sakshi
Sakshi News home page

‘రాడ్‌టెప్‌’కు మరిన్ని నిధులు కేటాయించాలి

Published Tue, Jan 25 2022 4:00 AM | Last Updated on Tue, Jan 25 2022 8:08 AM

Exporters seek support measures in budget to boost shipments - Sakshi

ఎగుమతిరంగం 2022–23 బడ్జెట్‌లో తమకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతోంది. రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రొడక్షన్‌ (రాడ్‌టెప్‌) పథకానికి కేటాయింపులు పెంచాలని కోరింది. ప్లాస్టిక్‌ తుది ఉత్పత్తుల దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు సుంకాలు పెంచాలని.. దేశీ తోలు పరిశ్రమకు ప్రోత్సాహకంగా ముడి సరుకుల దిగుమతులకు సుంకాల మినహాయింపు కావాలని డిమాండ్‌ చేసింది. లాజిస్టిక్స్‌ సవాళ్లను పరిష్కరించేందుకు ద్రవ్యపరమైన ప్రోత్సాహకాల అవసరాన్ని తెలియజేసింది. ఎంఎంస్‌ఎంఈలకు ప్రోత్సాహకంగా పార్ట్‌నర్‌షిప్‌ సంస్థలు, ఎల్‌ఎల్‌పీలపై పన్నును తగ్గించాలని బడ్జెట్‌ ప్రతిపాదనల కింద కేంద్ర ఆర్థిక శాఖకు భారతీయ ఎగుమతి దారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) సూచించింది. భారత్‌ కోసం ప్రత్యేకంగా షిప్పింగ్‌ లైన్‌ను ఏర్పాటు చేసేలా పెద్ద సంస్థలను ప్రోత్సహించాలని, అప్పుడు విదేశీ సంస్థలపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది.  

రవాణా వ్యయ భారం
‘‘ఎగుమతుల రంగం పెరిగిపోయిన రవాణా వ్యయాల రూపంలో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. విదేశీ మార్కెటింగ్‌ అన్నది పెద్ద సవాలుగా మారింది. ఎంఎస్‌ఎంఈలకు ఈ వ్యయ భారం మరితంగా ఉంటుంది. ఎగుమతిదారుల కోసం ద్వంద్వ పన్ను మినహాయింపు పథకం తీసుకురావాలి.  కాకపోతే రూ.5 లక్షల వరకు పరిమితి ఇందులో విధించొచ్చు’’అని ఎఫ్‌ఐఈవో డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌సహాయ్‌ తెలిపారు.

ఎగుమతి మార్కెట్‌కు రాడ్‌టెప్‌ పథకం కీలకమైనదని, దీనికింద ప్రస్తుతం కేటాయింపులు రూ.40,000 కోట్లుగానే ఉన్నట్టు ముంబైకి చెందిన ఎగుమతిదారు, టెక్నో క్రాఫ్ట్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ శారదా కుమార్‌ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈ వాస్తవాన్ని గుర్తించి మరిన్ని కేటాయింపులు చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై (ఫినిష్డ్‌ గూడ్స్‌) కనీసం 5 శాతం సుంకాన్ని విధించాలని ప్లాస్టిక్స్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి చైర్మన్‌ అరవింద్‌ గోయెంకా అభిప్రాయపడ్డారు. ‘‘ఉదాహరణకు పీవీసీ రెజిన్‌పై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. వ్యాల్యూ యాడెడ్‌ పీవీసీ ఉత్పత్తులపైనా ఇంతే మేర సుంకం అమల్లో ఉంది’’ అని వివరించారు.  

తోలు రంగానికి చేయూత..
తోలు వస్త్రాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల దిగుమతులపై పన్ను మినహాయింపును తిరిగి ప్రవేశపెట్టాలని కౌన్సిల్‌ ఫర్‌ లెదర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (సీఎల్‌ఈ) చైర్మన్‌ సంజయ్‌లీఖ డిమాండ్‌ చేశారు. దీంతో ముడిసరుకుల ఆధారితంగా ఉత్పత్తులు దేశీయంగానే తయారయ్యే అవకాశాన్ని ఏర్పాటు కల్పించినట్టు అవుతుందన్నారు. ఫరీదా గ్రూపు చైర్మన్‌ రఫీఖ్‌ అహ్మద్‌ కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేవారు. కార్మిక ఆధారిత తోలు రంగానికి ప్రోత్సాహంతో మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement