ఊగిసలాట మధ్య వారాంతాన యూఎస్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 47 పాయింట్లు(0.2 శాతం) లాభపడి 27,433కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 2 పాయింట్ల నామమాత్ర వృద్ధితో 3,351 వద్ద ముగిసింది. అయితే నాస్‌డాక్ 97 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 11,011 వద్ద స్థిరపడింది. వెరసి గురువారం నమోదైన ఆల్‌టైమ్ హై 11,108 నుంచి వెనకడుగు వేసింది. ప్రెసిడెంట్ ట్రంప్.. చైనీస్ యాప్‌లు వియ్‌చాట్, టిక్‌టాక్‌లను నిషేధించే సన్నాహాల నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య వివాదాలు పెరగవచ్చన్న ఆందోళనలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. జులైలో వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు 1.76 మిలియన్లకు చేరినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్‌లో నమోదైన 4.8 మిలియన్లతో పోలిస్తే ఇవి అత్యంత తక్కువే అయినప్పటికీ అంచనాల(1.6 మిలియన్లుకంటే అధికమేనని విశ్లేషకులు తెలియజేశారు.
ఫేస్‌బుక్ అప్
శుక్రవారం ఫాంగ్ స్టాక్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మినహా మిగిలిన కౌంటర్లు బలహీనపడ్డాయి. ఫేస్‌బుక్ 1.2 శాతం బలపడగా.. ఎంటర్‌టైన్‌మెంట్ బ్లూచిప్ నెట్‌ఫ్లిక్స్ 2.8 శాతం క్షీణించింది. ఈ బాటలో ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 2.3 శాతం, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఈకామర్స్ బ్లూచిప్ అమెజాన్ 1.8 శాతం చొప్పున క్షీణించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న టెస్లా ఇంక్ సైతం 2.5 శాతం వెనకడుగు వేసింది. కాగా.. జులైలో సబ్‌స్క్రైబర్లు భారీగా పెరిగినట్లు వెల్లడించిన టీమొబైల్ 6.5 శాతం జంప్‌చేసింది.
టెన్సెంట్ నేలచూపు
వియ్‌చాట్ నుంచి విడివడిన టెన్సెంట్ మ్యూజిక్ 3.3 శాతం నష్టపోగా.. ఇతర చైనీస్ కంపెనీలలో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ 1.9 శాతం, జేడీ.కామ్ 4.1 శాతం చొప్పున డీలాపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment