ఎంఎస్‌ఎంఈ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన మూల స్తంభాలని ఆ శాఖ సహాయమంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ సోమవారం పేర్కొన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, మరింత అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడ్డానికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని అన్నారు.
ఎంఎస్‌ఎంఈ రంగంపై ఫిక్కీ నిర్వహించన వార్షిక సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..
⇒ భారతదేశాన్ని స్వావలంబన సాధనకు, అలాగే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎకానమీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో పరిశ్రమ, సంబంధిత వర్గాలు కలిసి పని చేయాలి.
⇒ దేశంలో 6.3 కోట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఉన్నాయి. వాటి ద్వారా 11 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాం.
⇒ ఎంఎస్‌ఎంఈలు మన భారత్ జీడీపీ విలువలో దాదాపు 30 శాతం వాటాను అందిస్తున్నాయి. మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
⇒ దేశంలో ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పీఎంఈజీపీ (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) ఈ దిశలో ఒక ముందడుగు. ఈ పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో తయారీ, సేవల రంగంలో మొత్తం 1.03 లక్షల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి.
⇒ ఎంఎస్‌ఎంఈల పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం సహకారం రెట్టింపయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి ఎదరవుతున్న సవాళ్లను తగ్గించడానికి తగిన ప్రయత్నం జరుగుతుంది.
⇒ యువత పారిశ్రామికవేత్తలుగా మారే సంస్కృతిని పెంపొందించడానికి, ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించడానికి, వారి నాణ్యతను మెరుగుపరచడానికి, వారి సామర్థ్యాన్ని పెంచడానికి, వారి పోటీతత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది.
⇒ ఇప్పటికే ఉన్న అలాగే కొత్త ఎంఎస్‌ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి వాటిని బలోపేతం చేయడానికి మా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
⇒ దీనితోపాటు ‘జెడ్‌ఈడీ’ సర్టిఫికేషన్ పథకం (టెక్నాలజీ అప్‌గ్రేడేషన్– క్వాలిటీ సర్టిఫికేషన్ అందించడానికి ఉద్దేశించిన), నాణ్యత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ‘ఏఎస్‌పీఐఆర్‌ఈ’ డిజైన్ క్లినిక్ మొదలైన వాటి కింద ఎంఎస్‌ఎంఈలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఇతర సంస్థలతో కలిసి పని చేస్తోంది.
⇒ ప్రభుత్వం చాంపియన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది, ఇది ఒకే చోట అన్ని పరిష్కారాలను అందిస్తుంది. ఎంఎస్‌ఎంఈలను మరింత పోటీగా మార్చడానికిసైతం పోర్టల్‌ను దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పథకాల ద్వారా ఎంఎస్‌ఎంఈలు మరింత స్థిరంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము.
ఈ రంగం పురోగతి అవశ్యం:స్వైన్
కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి బీబీ స్వైన్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగం స్థిరమైన అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక పరమైన చేయూత అవసరమని అన్నారు. ‘రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ పనితీరు’ (ఆర్‌ఏఎంపీ) కింద ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సమన్వయంగా సహకారాన్ని అందించడానికి, ఇందుకు తగిన ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోందని వివరించారు. ఈ రంగం పురోగతి దిశలో 2020లో ప్రారంభించబడిన సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా ఫండ్ ఇప్పటి వరకు 125 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2,335 కోట్ల విలువైన వృద్ధి సంబంధ మూలధనాన్ని అందించిందని తెలియజేశారు. ఈ రంగం కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను పునరుద్ధరించడం, ఉద్యామ్, ఇ-శ్రామ్, నేషనల్ కెరీర్ సర్వీస్, ఏఎస్‌ఈఈఎం పోర్టల్‌ల పూర్తి స్థాయి ఏకీకరణ వంటి కార్యక్రమాల కోసం ప్రణాళిక రూపకల్పన జరుగుతోందన్నారు.
సాంకేతిక కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమాచార వ్యవస్థ, జాతీయ ఎంఎస్‌ఎంఈ పాలసీని రూపొందించడం, జెడ్‌ఈడీ ధృవీకరణ ద్వారా సమస్యలను పరిష్కరించడం, ఎంఎస్‌ఎంఈ చెల్లింపు సమస్యలను తొలగించడం వంటి చర్యలకూ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఎంస్‌ఎంఈలకు మద్దతుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ, వర్గీకరణలో అప్‌గ్రేడేషన్ విషయంలో ప్రభుత్వం పన్నుయేతర ప్రయోజనాలను 3 సంవత్సరాల పాటు పొడిగించిందని స్వైన్ పేర్కొన్నారు.
ఎకానమీలో కీలక పాత్ర
ఎంఎస్‌ఎంఈ రంగం సామర్థ్యం చాలా విస్తృతమైనది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం మరింత కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం. ఎకానమీ విలువలో ఈ రంగం వాటా 40-45 శాతంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం- ఆర్ నారాయణ్, ఎఫ్‌ఐసీసీఐ(సీఎంఎస్‌ఎంఈ ప్రెసిడెంట్)
Comments
Please login to add a commentAdd a comment