న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పురోగతి లక్ష్యంగా కేంద్రం జెడ్‌ఈడీ (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్) సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, లాభాలను పెంచడం, పర్యావరణంపై హానికరమైన పద్దతులను నియంత్రించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సంబంధించి తాజా పథకం ప్రయోజనకరంగా ఉంటుంనది మంత్రి రాణే తెలిపారు. ఎంఎస్‌ఎంఈ ఛాంపియన్స్ పథకంలో భాగమైన జెడ్‌ఈడీ ధృవీకరణ పథకం ద్వారా వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చని, ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని, పర్యావరణ స్పృహపై అవగాహన పెరుగుతుందని, సహజ వనరులను అత్యుఉత్తమంగా ఉపయోగించుకోవచ్చని, మార్కెట్ విస్తరించుకోవచ్చని మంత్రి వెల్లడించారు.
బహుళ ప్రయోజనం...
అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ పథకం కాంస్య, వెండి, బంగారంతో సహా మూడు ధృవీకరణ స్థాయిలను కలిగి ఉంటుంది. ఎంఎస్‌ఎంఈలు ఏదైనా ధృవీకరణ స్థాయికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన ప్రమాణాలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. పథకం కింద దాదాపు 20 మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ఎంఎస్‌ఎంఈలు జెడ్‌ఈడీ మార్గర్శకాల దిశగా చర్యలు తీసుకోవాలి. జెడ్‌ఈడీ ధృవీకరణ వ్యయంపై ఎంఎస్‌ఎంఈలు సబ్సిడీని పొందుతాయి. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ధృవీకరణ ఖర్చులో 80 శాతం వరకు సబ్సిడీ మొత్తం ఉంటుంది, అయితే చిన్న, మధ్యస్థ యూనిట్లకు ఇది వరుసగా 60 శాతం, 50 శాతంగా ఉంటుంది. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ పారిశ్రామికవేత్తల యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈలకు 10 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది.
పైన పేర్కొన్న వాటికి అదనంగా మంత్రిత్వ శాఖ యొక్క స్పూర్తి లేదా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ – క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్‌ఈ–సీడీపీ) భాగమైన ఎంఎస్‌ఎంఈలకు 5 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది. ఇంకా, జెడ్‌ఈడీ మార్గదర్శకాలు, ప్రమాణాలు పాటించడం ప్రారంభించిన తర్వాత ప్రతి ఎంఎస్‌ఎంఈకి పరిమిత ప్రయోజనం చేకూర్చే విధంగా రూ. 10,000 రివార్డు ప్రదానం జరుగుతుంది. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ సొల్యూషన్స్ వైపు వెళ్లేందుకు ప్రోత్సాహకరంగా వారికి జెడ్‌ఈడీ సర్టిఫికేషన్ కింద హ్యాండ్‌హోల్డింగ్, కన్సల్టెన్సీ మద్దతు కోసం ఎంఎస్‌ఎంఈకి రూ. 5 లక్షల వరకూ కేటాయింపు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్థిక సంస్థలు మొదలైన వాటి ద్వారా జెడ్‌ఈడీ సర్టిఫికేషన్ కోసం అందించే అనేక ఇతర ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు. ఎంఎస్‌ఎంఈ కవచ్ (కోవిడ్–19 రక్షణ నిమిత్తం) చొరవ కింద ఉచిత ధృవీకరణ కోసం కూడా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment