ధరలు పెరిగితే ధనవంతులకే నష్టం - కేంద్ర ఆర్థిక శాఖ | Finance Ministry Analysis: Inflation hurt rich more than poor in FY22 | Sakshi
Sakshi News home page

ఆర్థిక శాఖ వింత సూత్రీకరణ.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ధనవంతులే నష్టపోతున్నారట!

Published Fri, May 13 2022 9:27 AM | Last Updated on Fri, May 13 2022 12:58 PM

Finance Ministry Analysis: Inflation hurt rich more than poor in FY22 - Sakshi

వంట నూనె మొదలు పెట్రోలు, గోలీ మందులు మొదటు ఏసీల వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెరుగుతున్న ధరలతో పేదలు, సామాన్యులు విలవిలలాడుతున్నారు. బడ్జెట్‌ లెక్కలు తారుమారై అవస్థలు పడుతున్నారు. కానీ ఆర్థిక శాఖ సూత్రీకరణ మరో రకంగా ఉంది..  పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు, పేదల కంటే ధనవంతులే ఎక్కువగా నష్టపోతున్నారంటూ చిత్రమైన లెక్కలను ప్రజల ముందుకు తెచ్చింది. 


ఏప్రిల్‌ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, రిటైల్‌ కన్సుమర్‌ ఇండెక్స్‌ తదితర అంశాలకు కేంద్ర ఆర్థిక శాఖ 2022 మే 12న రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ పనితీరు పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర అంశాలను వివరిస్తూ.. పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, పెరిగిన ధరల ప్రభావం పేదలు, సామాన్యుల కంటే ధనవంతులపైనే అధికంగా ఉందంటూ విశ్లేషణ చేసింది. ఇందు కోసం 2011-12 నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆధారంగా వివిధ కేటగిరీల వారీగా కుటుంబాలు చేస్తున​ ఖర్చుల వివరాలను ప్రమాణికంగా తీసుకుని వివరణ ఇచ్చింది. దీనిపై మనీ కంట్రోల్‌ ప్రచురించిన కథనం ఆధారంగా..

మూడు కేటగిరీలు మూడు రకాల ఖర్చులు
కేంద్ర ఆర్థిక శాఖ విశ్లేషణ ప్రకారం... దేశంలో వినియోగదారులను మూడు కేటగిరీలుగా పేర్కొంది. అందులో పై స్థాయిలో ఉండే ధనవంతులు 20 శాతం, మధ్య తరగతి 60 శాతం, పేదలు 20 శాతంగా తీసుకున్నట్టు తెలిపింది. ఈ కేటగిరీల వారు చేస్తున్న ఖర్చులను కూడా మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంది. అవి ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌, ఫ్యూయల్‌ అండ్‌ లైట్‌ (రవాణా ఖర్చులతో కలిపి), ఫుడ్‌, ఫ్యూయల్‌ మినహాయించి ఇతర వస్తువులుగా పేర్కొంది.

వారిపైనే అధికం
పైన పేర్కొన్న మూడు కేటగిరీలకు చెందిన కుటుంబాలు జీవించేందుకు మూడు కేటగిరీలకు పెడుతున్న ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ వీరిపై గడిచిన రెండేళ్లుగా ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అంచనా వేస్తూ ఆర్థిక శాఖ విశ్లేషణాత్మ వివరణ తయారు చేసింది. ఇందులో ఎవ్వరూ ఊహించని విధంగా పేదలు, మధ్య తరగతి కంటే ధనవంతులపైనే ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచింది!

పేదలపై భారం పడలేదు!
ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం 20 శాతం ఉన్న పేదవారిపై ద్రవ్యోల్బణ ‍ప్రభావం పరిశీలించగా 2021 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం ఉండగా 2022 ఆర్థిక సంవత్సరంలో అది 5.2 శాతానికి పడిపోయింది. ఇదే కేటగిరిలో పట్టణ ప్రాంత పేదలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణం 6.8 శాతం నుంచి 5.7 శాతానికి  తగ్గి వారికి ఉపశనం కలిగించింది.

మధ్య తరగతి సేఫ్‌!
ఇక సమాజంలో 60 శాతంగా ఉన్న మధ్య తరగతి విషయానికి వస్తే 2021 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉండగా 2022 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో అయితే 6.8 శాతం నుంచి 5.7 శాతానికి దిగి వచ్చింది.

పట్టణ ధనికులపైనే!
ద్రవ్యోల్బణం కారణంగా 20 శాతంగా ఉన్న సంపన్న వర్గాలకు జరుగుతున్న నష్టాన్ని ఆర్థిక శాఖ ఇలా వివరించింది... 2021 ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2022 ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతానికి చేరుకుంది. అంటే గ్రామీణ ప్రాంత సంపన్నులపై 0.1 శాతం అధికంగా ద్రవ్యోల్బణం ప్రభావం చూపించింది. ఇక పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే 5.7 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. మొత్తంగా సమాజంలో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పట్టణ ప్రాంతాలకు చెందిన సంపన్నులపై అత్యధికంగా 1.1 శాతం ద్రవ్యోల్బణం  ప్రభావం చూపింది. సమాజంలోని వివిధ ఆదాయ వర్గాల వారిపై ధరల పెరుగుదల ప్రభావాలను సునిశితంగా గమనిస్తే పేదలు, మధ్య తరగతి కంటే సంపన్నులపైనే ఎక్కువ ప్రభావం చూపిందంటూ ఆర్థిక శాఖ సూత్రీకరించింది. 

ఆర్బీఐ ఇలా
అంతకు ముందు ఆర్థిక శాఖ విశ్లేషణలకు విరుద్ధంగా 2022 మే 4న రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యోల్బణ ఫలితాలను విశ్లేషించింది. రెపోరేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. ద్రవ్యోల్బణం పేదలపై అధిక ప్రభావం చూపిందని, వారి కొనుగోలు శక్తిని దారుణంగా దెబ్బతీస్తోందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. ఆర్బీఐ కొనుగోలు శక్తిని ప్రధానంగా పరిశీలనలోకి తీసుకోగా ఆర్థిక శాఖ కొనుగోలు వల్ల జరుగుతున్న వ్యయాలను ప్రధానంగా చేసుకుని విశ్లేషణ చేపట్టడం విశేషం. ఆర్థిక శాఖ అంచనాలు సూత్రీకరణలు ఎలా ఉన్నా పెరుగుతున్న ధరలు మాత్రం సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి....
చదవండి: ధరదడ.. పరిశ్రమకు కరోనా సెగ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement