న్యూఢిల్లీ: కొత్త పంటలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటమే ఆందోళనకర అంశంగా మారిందని ఆయన చెప్పారు. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టమైన 7.44 శాతం స్థాయికి ఎగిసిన నేపథ్యంలో ప్రభుత్వ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూరగాయల రేట్ల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఎగియడం తాత్కాలికమేనని, ధరలు వేగంగా దిగి వచ్చే అవకాశం ఉందని అధికారి వివరించారు. వర్షపాతం 6 శాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఖరీఫ్ సీజన్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచమంతటా ధరలు పెరిగిపోయాయని, భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదని ఆయన చెప్పారు. అయితే, ధరలను తక్కువ స్థాయిలో ఉంచేందుకు సరళతర వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటం వల్ల భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉందన్నారు. అటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రభుత్వానికి లేదని అధికారి తెలిపారు. మరోవైపు, క్రూడాయిల్ రేట్లు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం కాస్త ఆందోళనకర అంశమే అయినప్పటికీ.. చమురు మార్కెటింగ్ కంపెనీల కోణంలో ప్రస్తుతానికైతే భరించగలిగే స్థాయిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ముడిచమురు రేట్లు 80-90 డాలర్ల మధ్య వరకూ ఉంటే ఫర్వాలేదని, 90 డాలర్లు దాటితేనే ద్రవ్యోల్బణం, ఇతరత్రా అంశాలపై ప్రభావం పడగలదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment