ఇప్పటికే మన దేశంలో చాలా సంస్థలు బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని.. కస్టమర్లకు లోన్స్ ఇస్తున్న సంగతి తెలిసింది. ఇందులో బజాజ్, టాటా క్యాపిటల్ మొదలైన సంస్థలు అతి తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' (Flipkart) ప్రవేశించింది. ఇందులో భాగంగానే యాక్సిస్ బ్యాంకుతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం వల్ల సుమారు 450 మిలియన్ కస్టమర్‌లు అదనపు సౌలభ్యం పొందే అవకాశం ఉంది. కేవలం 30 సెకన్లలోపు రూ. 5 లక్షల పర్సనల్ లోన్ పొందవచ్చని చెబుతున్నారు. లోన్ తిరిగి చెల్లించడానికి కాల వ్యవధి 6 నుంచి 36 నెలల వరకు ఉంటుంది. కావున ఇది తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము.
ప్రముఖ బ్యాంకుల సహకారంతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే 'బై నౌ పే లేటర్' (BNPL), ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లు (EMI) అండ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు వంటివి అందిస్తున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా వెల్లడించారు. కాగా ఇప్పుడు తాజాగా యాక్సిస్ బ్యాంక్ సహకారంతో పర్సనల్ లోన్ విభాగంలో కూడా అడుగుపెట్టడం చాలా సంతోషముగా ఉందన్నారు.
(ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ)
ఫ్లిప్‌కార్ట్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వారు పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి ప్రాథమిక వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందించిన తరువాత యాక్సిస్ బ్యాంక్ మీకు ఎంత లోన్ అందించాలి, ఎంత లోన్ తీసుకోవడానికి అర్హులు అని నిర్ధారిస్తుంది. ఆ తరువాత మీరు తిరిగి చెల్లించే అర్హతను బట్టి లోన్ మొత్తంతో పాటు.. రీపేమెంట్ పద్దతిని కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి సౌలభ్యం కేవలం ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు కూడా కోకొల్లలుగా అందిస్తున్నాయి. పర్సనల్ లోన్ కావాలనుకునే వారు వాటిని గురించి కూడా ఆరా తీయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment