టెక్ పరిశ్రమలో జోరుందుకున్న లేఆఫ్‌లు ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ వంటి ఇతర పరిశ్రమలకూ విస్తరిస్తున్నాయి. ఈ పరిశ్రమలలో పనిచేస్తున్న వందలాది మంది చిన్నపాటి ఉద్యోగులకూ ఉద్వాసన తప్పడం లేదు.
కొత్త ఏడాదిలో ఇప్పటికే లేఆఫ్‌లను ప్రకటించిన అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాల సరసన ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా చేరాయి. వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. ఈ లేఆఫ్‌లు నిధుల కొరతతో సతమతమవుతున్న స్టార్టప్ రంగం కష్టాలను తెలియజేస్తున్నాయి.
స్విగ్గిలో 400 మంది!
ఖర్చులను తగ్గించుకుని, లాభదాయకత వైపు పయనించడానికి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ దాదాపు 350-400 మంది ఉద్యోగులను లేదా దాని వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 7 శాతం మందిని తొలగించనున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
స్విగ్గీలోని టెక్ టీమ్‌తో పాటు కస్టమర్ కేర్ విభాగంలో పనిచేసే ఉద్యోగుపైనే లేఆఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న స్విగ్గీలో ఇది రెండో రౌండ్ లేఆఫ్. గతేడాది జనవరిలో స్విగ్గీ 380 ఉద్యోగాలను తొలగించింది.
ఫ్లిప్‌కార్ట్‌లో 1000 మంది
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వందలాది మంది ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైంది. వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారంగా 1,000 మంది ఉద్యోగులను లేదా 5 శాతం వర్క్‌ఫోర్స్‌ను వదులుకుంటున్నట్లు పలు నివేదికలు పేర్కన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment