అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసు అందించే ఫ్లిక్స్‌బస్ సంస్థ ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నై మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించింది. కేవలం రూ.99కే హైదరాబాద్-బెంగళూరు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.
కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ రూట్లలో బస్సులను ప్రారంభించారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్యాసింజర్ల సంఖ్య అధికంగా ఉండడంతో వారి ప్రయాణాలకు అనుగుణంగా కంపెనీ ఆఫర్ ప్రకటించింది. రూ.99కే ఈ రూట్‌లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 10-అక్టోబరు 6 మధ్య ఉండాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖ
ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలు ఆశించినమేర వృద్ధి చెందడం లేదు. దాంతో చాలామంది ప్రయాణికులు దూర ప్రయాణాలకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఎంచుకుంటున్నారు. వారాంతాలు, సెలవులు, పండగల సమయాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. కంపెనీలు అందుకు అనువుగా సర్వీసులు నడుపుతూ లాభాలు గడిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయంగా సేవలందిస్తున్న ఫ్లిక్స్‌బస్ అనే జర్మన్ కంపెనీ దక్షణాది రాష్ట్రాల్లో సేవలు ప్రారంభించడం విశేషం. 2011లో స్థాపించిన ఈ కంపెనీ యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి దాదాపు 40 దేశాల్లో సర్వీసులు నడుపుతోంది. 4 లక్షల రూట్లలో 5000 ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment