విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. నిదుల సమీకరణ కోసం కేంద్రం భారీ ప్రణాళిక రచిస్తోంది. ఈ రోజు దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఆగస్టు 23) నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్(ఎన్ఎంపి)ను ప్రారంభించారు. ఇందులో భాగంగా పర్యవేక్షణ లోపించిన పలు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి నగదుగా మార్చాలని భావిస్తుంది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనేది ప్రభుత్వం ఆస్తుల ద్రవ్యీకరణ చొరవకు మధ్యకాలిక రోడ్ మ్యాప్ గా పనిచేస్తుందని నీతి అయోగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
నిర్దేశిత గడువులోగా తిరిగి తీసుకుంటాం..
ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా కేంద్రం రూ.6 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆస్తులను ప్రైవేటీకరణ చేయాలని భావిస్తుంది. ఈ జాబితాలో జాతీయ రహదారులతో సహా పవర్ గ్రిడ్ పైప్ లైన్ల ఆస్తుల ఉన్నాయి. ఆస్తుల ద్రవ్యీకరణ కోసం హైవేలు, రైల్వేలు, విద్యుత్ మొదటి మూడు రంగాలుగా కేంద్రం గుర్తించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రణాళికను వివరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలా మాట్లాడారు.. "ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల ఆస్తులను మరింతగా పర్యవేక్షించొచ్చు. వీటిలో పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను పెంచవచ్చు. అయితే మేం వీటిని అమ్మేస్తున్నాం అనే అనే వారికి ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా ఈ ఆస్తులను పర్యవేక్షిస్తాం. అయితే, యాజమాన్య హక్కులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివే, నిర్దేశిత గడువులోగా తిరిగి మళ్లీ వాటిని తీసుకుంటాము" అని సీతారామన్ పేర్కొన్నారు.
ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్ లైన్ల ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తోంది. వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా రంగాలన్నీ ప్రైవేట్ పరం చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఎయిర్‌పోర్టు నిర్వహణలో 'పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)' సత్ఫలితాలిస్తోందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని రైల్వేస్టేషన్లకు కూడా విస్తరించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజా అసెట్ మానిటైజేషన్‌లో పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment